- సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు అనుమతులివ్వండి
- ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు నష్టమని వివరణ
- సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ తోనూ సమావేశం
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీకి చెందిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, దానికి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమ్మక్క–సారక్క ప్రాజెక్ట్ కు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్ తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయెల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో బనకచర్లను వ్యతిరేకించడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ కు నీటి కేటాయింపులు, సమ్మక్క–సారక్క ప్రాజెక్ట్ డీపీఆర్, కృష్ణా నదిపై టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఆ వివరాలను ఉత్తమ్ వివరించారు.
కృష్ణా జల వివాదాలు త్వరగా పరిష్కరించాలి
పాలమూరు–రంగారెడ్డిప్రాజెక్టుకు 90 టీఎంసీలు కేటాయించాలని, అందులో 45 టీఎంసీలు వెంటనే కేటాయించాలని కోరినట్లు ఉత్తమ్ చెప్పారు. ‘‘సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు టీఏసీ, ఐటీసీ అనుమతులు ఇవ్వాలి. తెలంగాణ–ఏపీ మధ్య కృష్ణా నీటి వివాదాలు ట్రిబ్యునల్ ద్వారా త్వరగా పూర్తి చేయాలి. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం.. గోదావరి వరద జలాలు వినియోగం సాధ్యం కాదు. ఈ అంశాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్‌కి తెలియజేశాం” అని అన్నారు. పీఎంకేఎస్ వై కింద 2026 –2031 వరకు ఆర్థికసాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.
గోదావరి జలాల తరలింపు సహించేది లేదు
‘‘సమ్కక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను అందజేశాం. సీడబ్ల్యూసీ కోరిన వివరాలిచ్చాం. వెంటనే అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశాం. బ్రిజేష్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2) 811 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు కేటాయించాలి. ఈ ప్రక్రియను కేంద్రం చొరవ చూపి వేగవంతం చేయాలి’’ అని కేంద్రమంత్రిని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ అందజేసిన ప్రీఫీజుబులిటీ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మంత్రికి మరోసారి చెప్పామన్నారు. ‘‘గోదావరిలోని వరద జలాల తరలింపును సహించేది లేదు. ఇప్పుడు మళ్లీ.. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు పేరును మార్చి గోదావరి జలాలను తరలించాలని చూస్తున్నది. ఏపీ తీరు ముమ్మాటికీ చట్టవిరుద్ధం. బనకచర్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్నాటక వ్యతిరేకిస్తున్నాయి. అనుమతులు ఇవ్వొద్దని కోరాం’’ అని అన్నారు.
ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు స్టే ఉంది
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే.. తెలంగాణకు నష్టవ జరగుతుందనే విషయాన్ని కేంద్ర మంత్రి, సీడబ్ల్యూసీ చైర్మన్ కు స్పష్టంగా తెలిపినట్టు ఉత్తమ్ చెప్పారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు 519 మీటర్ల కంటే పెంచొద్దని సుప్రీంకోర్టులో స్టే ఉందన్నారు. అయినప్పటికీ కర్నాటక ప్రభుత్వం పెంపుపై జీవో ఇచ్చి, భూసేకరణ చేపడుతున్నదన్నారు. ఈ విషయం కేంద్ర మంత్రికి తెలిపి, జోక్యం చేసుకొవాలని కోరామన్నారు. 22 నెలలుగా సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడుగుతున్నామని గుర్తు చేశారు. నిధులు ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని గతంలో కేంద్రం చెప్పగా, దేవాదుల ప్రాజెక్టు మినహా మిగిలిన అన్ని పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కొన్ని ప్రాజెక్టులను గుర్తించామని, వాటికి సీడబ్ల్యూసీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా నీటిపై బీఆర్ఎస్ తీవ్ర నిర్లక్ష్యం
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఉత్తమ్ మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాలను కేటాయింపులకు మించి తరలించొద్దని స్పష్టంగా ఉందన్నారు. అయినా గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఏపీ లెక్కకు మించిన నీటిని తరలించుకుపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబీకి నిధులు ఇచ్చి కొన్ని టెలిమెట్రీలు అమర్చామన్నారు. ఫేజ్-1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేశాం, ఫేజ్-2 కింద మరో తొమ్మిది, ఫేజ్-3 కింద 11 ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పనులు సత్వరం చేసేలా కేఆర్ఎంబీకి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామన్నారు.
పీఎం–కేఎస్ వై కింద నిధులు కోరిన ప్రాజెక్ట్ లు
ప్రాణహిత–చేవెళ్ల
నారాయణపేట–కొడంగల్
సీతారామ & సీతమ్మ సాగర్
పాలమూరు– రంగారెడ్డి
చిన్న కాళేశ్వరం మోదికుంటవాగు
చనాక– కొరాట డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్
