బయటకు పంపిన్రు.. బద్నాం చేస్తున్నరు..అలాంటి వారి గురించి తప్పకుండా మాట్లాడుతా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

బయటకు పంపిన్రు.. బద్నాం చేస్తున్నరు..అలాంటి వారి గురించి తప్పకుండా మాట్లాడుతా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
  • నేను ధైర్యవంతురాలిని.. ఆర్నెళ్లు జైల్లో పెట్టినా భయపడలే
  • తుమ్మల లాంటి సీనియర్ నేతలను వదులుకోవడం కేసీఆర్ చేసిన తప్పిదం
  • జూబ్లీహిల్స్​ లో కాంగ్రెస్​ గెలవడం బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యమేనని కామెంట్​

ఖమ్మం, వెలుగు: పార్టీ పటిష్టత కోసం 20 ఏండ్లు పనిచేసిన తనను కుట్రచేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని.. అలాంటి వారి గురించి కచ్చితంగా మాట్లాడుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బయటకు పంపి.. బద్నాం చేస్తున్నారన్నారు. భవిష్యత్ లో ఇంకా నీచస్థాయిలో దాడి చేస్తారని.. అయినా బెదిరేది లేదన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా మంగళవారం కవిత ఖమ్మం వచ్చారు.

 ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాను చాలా ధైర్యవంతురాలినని, ఆరు నెలలు జైల్లో పెట్టినా భయపడలేదని కవిత చెప్పారు. ‘‘నాపై ఇంకా దిగజారి దాడి చేస్తారని నాకు తెలుసు. అయినా సరే తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద మోస్తా. వాళ్లు రాజకీయాల్లోకి వచ్చేందుకు భయపడవద్దనే నేను పోరాటం చేస్తున్నా. అందరికీ అవకాశం, అభివృద్ధి, ఆత్మగౌరవమనేది మా విధానం”అని కవిత చెప్పారు. 

కేసీఆర్​ ను వ్యక్తిగతంగా నిందించడం లేదని, తనపై కుట్ర చేసిన వారిని మాత్రం వదిలేది లేదన్నారు. తుమ్మల నాగేశ్వర్​రావు లాంటి సీనియర్ నేతలను వదులుకోవడంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని కవిత అన్నారు. సొంత బిడ్డను తనను కూడా బయటకు పంపించారని, దీంతో చాలా మంది పార్టీలో ఉన్న వారు తమ పరిస్థితి ఏంటని అనుకుంటున్నారన్నారు.  పార్టీ గురించి ఇప్పుడే ఆలోచన చేయటం లేదని..  పార్టీ పెట్టేది ఉంటే.. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి, ఢంకా బజాయించి ప్రకటిస్తానన్నారు.  

ప్రతిపక్షాల వైఫల్యంతోనే కాంగ్రెస్​ గెలుపు

ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. జాగృతి జనం బాటతో అధికార, ప్రతిపక్షాలు నిద్ర లేస్తున్నాయని.. బీసీలకు పార్టీ పరంగా సీట్లు అంటూ సీఎం మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల నిర్వహించాలని..  రేవంత్ రెడ్డి బీసీ ద్రోహిగా మిగిలిపోవద్దని సూచించారు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో పద్మశ్రీ వనజీవి రామయ్య కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.