అదుపులో తిప్పిరి తిరుపతి ? విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్టు ప్రచారం

అదుపులో తిప్పిరి తిరుపతి ? విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్టు ప్రచారం
  • విజయవాడ, ఏలూరు, కాకినాడలో తనిఖీలు  
  • అదుపులో మొత్తం 60 మంది మావోయిస్టులు !

హైదరాబాద్/భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌‌జీతో పాటు 60 మంది మావోయిస్టులను ఏపీ పోలీసులు పట్టుకున్నారని తెలుస్తున్నది. ఏపీని సేఫ్​జోన్‌‌గా భావించి విజయవాడకు వచ్చిన తిరుపతితో పాటు ఆయన భద్రతా సిబ్బంది, మరికొందరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హిడ్మా ఎన్‌‌కౌంటర్​సందర్భంగా దొరికిన డైరీ ఆధారంగా ఏపీని మావోయిస్టులు సేఫ్​జోన్‌‌గా భావించారని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే హిడ్మాతో పాటు మరికొందరు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు రాగా.. తిప్పిరి తిరుపతి, ఇంకొందరు కాకినాడ, ఏలూరు, విజయవాడలోని న్యూఆటోనగర్​ప్రాంతాల్లో షెల్టర్​తీసుకున్నట్టు తెలిసింది. వీరంతా వలస కూలీల్లా అక్కడ ఉంటున్నట్టు పోలీసులు పసిగట్టారు. వారు ఎక్కడుంటున్నారో పక్కా ఆధారాలు దొరకడంతో ఆక్టోపస్​పోలీసుల సాయంతో విజయవాడ, ఏలూరు, కాకినాడ ప్రాంతాలతో పాటు పలు చోట్ల తనిఖీలు చేసి 60 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. వీరిలో తిప్పిరి తిరుపతి కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. 

పోలీసుల అదుపులో జ్యోతి కూడా..
విజయవాడ న్యూఆటోనగర్‌‌‌‌లోని ఒక బిల్డింగ్‌‌లో తలదాచుకుంటున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది తిప్పిరి తిరుపతి అలియాస్​దేవ్‌‌జీకి సంబంధించిన గార్డులు, మిగిలినోళ్లు హిడ్మాకు రక్షణగా ఉండే సభ్యులుగా గుర్తించారు. మరోవైపు పోలీసుల అదుపులో తిరుపతి ముఖ్య రక్షణ అనుచరురాలు జ్యోతి కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే తిరుపతి వివరాలు మాత్రం బయటకు రావడం లేదు. 

ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని పౌర హక్కుల, సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు న్యూఆటోనగర్‌‌‌‌కు భద్రతా బలగాలు వెళ్లిన సమయంలో పలువురు మావోయిస్టులు పారిపోయినట్టు తెలుస్తున్నది. కాగా, తమ అదుపులోకి తీసుకున్న తిప్పిరి తిరుపతి సహా మిగతా మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.సూర్యం డిమాండ్​ చేశారు.