- ఇక మిగిలింది గణపతి మాత్రమే.. అనారోగ్యంతో ఆయన సతమతం
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్నది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన అగ్రనేతల్లో నంబాల కేశవరావును ఇప్పటికే ఎన్‌కౌంటర్‌చేసిన భద్రతా బలగాలు.. ఇప్పుడు మడవి హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశాయి.
మరోవైపు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి సీనియర్ లీడర్లు ఇప్పటికే లొంగిపోయారు. మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్దేవ్జీ సైతం పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక ఉద్యమంలో మిగిలిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్గణపతి మాత్రమే. ఆయన కూడా వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ లెక్కన మావోయిస్టు పార్టీ మనుగడ ఇక కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గ్రీన్‌హంట్ నుంచి ఆపరేషన్ కగార్ దాకా..
1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీలో మొదలైన నక్సలిజం.. ఆ తర్వాత దేశమంతటా విస్తరించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమసమాజ నిర్మాణమే తమ లక్ష్యమంటూ మావోయిస్టులు ఆయుధాలతో పోరుబాటు పట్టారు. దశాబ్దాల పోరాటంలో నక్సలిజం అనేక రకాలుగా రూపాంతరం చెంది.. చివరికి సీపీఐ మావోయిస్టు పేరుతో స్థిరపడింది. ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా మావోయిస్టులు జనతన సర్కార్ నిర్వహించడం మొదలుపెట్టే స్థాయికి వెళ్లి.. ఇప్పుడు ఉద్యమమే కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం 2009లో ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ ప్రారంభించింది.
అప్పటి నుంచి కేంద్ర బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు వివిధ రకాలుగా యాంటీ నక్సల్ ఆపరేషన్స్ చేపట్టాయి. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై నిర్బంధం తీవ్రం చేసింది. దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాలతో 2024 జనవరి నుంచి దండకారణ్యంలో ‘ఆపరేషన్ కగార్’ మొదలైంది. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఈ ఏడాది మే 22న ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న సుమారు 210 మావోయిస్టులతో కలిసి పోలీసులకు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. అప్పటి నుంచి హిడ్మాపై కన్నేసిన కేంద్ర బలగాలు తాజాగా ఎన్‌కౌంటర్ చేశాయి.
మరోవైపు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సైతం ప్రస్తుతం ఏపీ పోలీసులు అదుపులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఇక మిగిలి ఉన్నది గణపతి మాత్రమే. ఆయన వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. మరో వైపు, మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలు భద్రతా బలగాలకు కలిసి వచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతలను, వారి వెంట వందలాది మంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తేగలిగారు.
సేఫ్ జోన్ నుంచి మైదాన ప్రాంతాలకు..
భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడ్తుండడంతో మావోయిస్టులకు సేఫ్‌జోన్ లేకుండా పోయింది. 2014లో 126 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా.. 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది. ఆ తర్వాత ఏడాదిన్నర వ్యవధిలోనే చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, జార్ఖండ్‌లోని వెస్ట్‌సింగ్ భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు మాత్రమే మావోయిస్టు పార్టీ పరిమితమైంది. ఈ క్రమంలో కొన్ని నెలలు గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అడవులను జల్లెడ పడుతున్నది.
ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు తిరిగి అడవుల్లోకి రాకుండా పోలీస్ బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తూ 24/7 గస్తీ కాస్తున్నారు. దీంతో మావోయిస్టుల కు సేఫ్జోన్లేకుండా పోయింది. ఇక మావోయిస్టులకు మిగిలింది ఉద్యమం వీడి జనజీవన స్రవంతిలో కలవడం లేదంటే అడవులను వీడి మైదాన ప్రాంతాల్లో తలదాచుకోవడం! ఇలా మైదాన ప్రాంతాలకు వెళ్లే క్రమంలోనే హిడ్మా ఎన్‌కౌంటర్‌కు బలికాగా, తిరుపతి పోలీసులకు చిక్కినట్టు తెలుస్తున్నది.
