న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ సెక్టార్అభివృద్ధికి రూపొందించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం మూడో రౌండ్లో 17 కొత్త దరఖాస్తుదారులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మ్యాన్-మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) అపెరల్, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ రంగాలలో పెట్టుబడులను వేగవంతం చేయనుంది.
దేశీయ తయారీని పెంచడం, భారతదేశ ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడం ఈ స్కీమ్ లక్ష్యం. కొత్తగా ఆమోదం పొందిన దరఖాస్తుదారులు మొత్తం రూ. 2,374 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 12,893 కోట్లకు పైగా విక్రయాలు సాధించవచ్చని, రాబోయే సంవత్సరాలలో సుమారు 22,646 మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొంది. ఎంఎంఎఫ్ అపెరల్స్, ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూ. 10,683 కోట్ల కేటాయింపుతో 2021 సెప్టెంబర్ 24న ఈ పథకాన్ని నోటిఫై చేశారు.
