తిరుగుబాటు జెండా ఎగురవేసిన కాంగ్రెస్ అసమ్మతి నేతలు

తిరుగుబాటు జెండా ఎగురవేసిన కాంగ్రెస్ అసమ్మతి నేతలు

నల్గొండ, వెలుగు: నల్గొండ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్​పార్టీ అసమ్మతి నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎంపీలు ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలు ఏకతాటిపైకొచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే సహించబోమని, పార్టీలో అలాంటి పరిస్థితులు ఎదురైతే మూకుమ్మడిగా రేవంత్​ నాయకత్వంలోనే పనిచేస్తామని శపథం చేశా రు. మంగళవారం చౌటుప్పుల్​ మండలం ఆందోళ్​ మైసమ్మ టెంపుల్​ వద్ద అసమ్మతి నేతలు మీటింగ్​పెట్టారు. పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​అధ్యక్షతన జరిగిన సమావేశంలో పది నియోజకవర్గాల నుంచి పార్టీ లీడర్లు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టికెట్​ఆశిస్తున్న వారితోపాటు, పార్టీ పదవులు ఆశించి భంగపడ్డవారంతా ఈ మీటింగ్​కు వచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో నేతల వైఖరి గురించి చర్చించారు. జిల్లాలో రేవంత్​రెడ్డి రాకను అడ్డుకున్న ఎంపీలు మే 6న జరిగే రాహుల్​ సభ సక్సెస్​కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఇప్పటి నుంచే అడ్డుకోకుంటే భవిష్యత్తులో తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే  జిల్లా నేతలకు వ్యతిరేకంగా రేవంత్​రెడ్డి నాయకత్వానికే మద్దతు తెలపాలని నిర్ణయించారు. రేవంత్​రెడ్డికి నష్టం కలిగించే పని చేస్తే ఊరుకోబోమని, ఆ పరిస్థితి తలెత్తితే అందరూ పీసీసీ చీఫ్​కు అండగా నిలవాలని తీర్మానించారు. వరంగల్​లో జరిగే రాహుల్​సభను విజయవంతం చేయడానికి భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.  

సీనియర్ల రాకను అడ్డుకుంటే ఊకోం

జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు హైకమాండ్​నియమించిన సీనియర్లను జిల్లాకు రానివ్వకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారని, అలాంటి చర్యలకు పాల్పడితే ఊకోమని అసమ్మతి నేతలు హెచ్చరించారు. నల్గొండ పార్లమెంట్​ఇన్​చార్జిగా గీతారెడ్డిని నియమిస్తే ఆమె రాకుండా అడ్డుకున్నారని, ఈ నెల 27న జిల్లాకు రావాల్సిన రేవంత్​ను కూడా రాకుండా కట్టడి చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే అసమ్మతి నేతల ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, సీనియర్లను జిల్లాకు ఆహ్వానిస్తామని చెప్పారు. 

మా సీట్లు మాకే ఇవ్వాలి

రెడ్డి సామాజికవర్గానికి చెందిన సీట్లే కాకుండా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ సీనియర్లు వేలు పెడుతున్నారని, రిజర్వుడు సీట్లను అమ్ముకుని పబ్బం గడపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గాల్లో బీసీలకు రెండు, మైనార్టీలకు ఒక సీటు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలో ఇప్పుడు పనిచేస్తున్న లీడర్లకే కేటాయించాలని, కొత్తవాళ్లను తీసుకురావాలని ప్రయత్నిస్తే ఊకోమని హెచ్చరించారు. మరికొందరు మాత్రం అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే​వాళ్ల కోసమే పనిచేయాలి తప్ప పార్టీ వ్య తిరేక చర్యలకు పాల్పడొద్దని సూచించారు. సమావేశంలో పార్టీ సీనియర్లు దుబ్బాక నర్సింహారెడ్డి, నాగిరెడ్డి, సంజీవరెడ్డి, అల్లం ప్రభాకర్​ రెడ్డి, అయోధ్యరెడ్డి, కొండేటి మల్లయ్య, పున్నా కైలాష్​నేత, పల్లె రవికుమార్​గౌడ్, సిరాజ్​ఖాన్​ తదితరులు పాల్గొన్నారు.