కాంగ్రెస్ .. దళితులకు 20 లక్షల ఎకరాలు పంచింది : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ .. దళితులకు 20 లక్షల ఎకరాలు పంచింది : జీవన్ రెడ్డి

కరీంనగర్, వెలుగు: నిజమైన దళిత ద్రోహి కేసీఆర్ అని.. దళితుడిని సీఎం చేస్తామని ఎందుకు చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అర్రాస్ పాట పాడడం బీఆర్ఎస్ వాళ్లకే అలవాటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అర్రాస్ పాట పాడినట్లు ఉందని ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్​లో సెకండ్ ఏఎన్​ఎంల దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. దళితులకు 20 లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనన్నారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఊళ్లలో ఓట్లు అడగలేని పరిస్థితి నెలకొందని, తాము ఇందిరమ్మ ఇళ్ల గృహ సముదాయం ఉన్న చోటే ఓటు అడుగుతామని స్పష్టం చేశారు. పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నామని తెలిపారు. బీసీల్లో 10 శాతం మందికే బీసీ బంధు ఇస్తే.. మిగతా 90 శాతం బీసీలకు ఆర్థిక సాయం అందేదెలా అని ప్రశ్నించారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఏఎన్ఎంల దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఏఎన్ఎంలలో సగానికిపైగా దళిత ఆడబిడ్డలే ఉన్నారని తెలిపారు. సెకండ్ ఏఎన్ఎం పోస్టులను రెగ్యులరైజ్ చేయడానికి కొత్త పోస్టులు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. 100 శాతం అర్హత ఉన్న ఏఎన్ఎంలకు రాత పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.  జనవరిలో కొత్త ప్రభుత్వం వస్తుందని, మార్చి 31 లోగా సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. 

నరేందర్ రెడ్డి, మేడిపల్లిని ఆశీర్వదించండి.. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించకముందే కరీంనగర్, చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేడిపల్లి సత్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొనడం చర్చనీయాంశమైంది. సెకండ్ ఏఎన్ఎంల దీక్షాశిబిరంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ‘రాఖీ పండుగ సందర్భంగా, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మిత్రుడు మేడిపల్లి సత్యంను మీరు ఆశీర్వదిస్తే రేపు ఎమ్మెల్యే గా అసెంబ్లీలో అడుగుపెడ్తరు’ అని ప్రకటించడం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.