ఎమర్జెన్సీ.. చీకటి అధ్యాయం.. సంజయ్ గాంధీ చర్యలతో అరాచకం

ఎమర్జెన్సీ.. చీకటి అధ్యాయం.. సంజయ్ గాంధీ చర్యలతో అరాచకం
  • ఓ పత్రికలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆర్టికల్ 
  •  ఎమర్జెన్సీ టైంలో మాటల్లో చెప్పలేని హింస జరిగిందని వెల్లడి 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఎమర్జెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ.. దేశ చరిత్రలో చీకటి అధ్యాయం మాత్రమే కాదని, ఆ సమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ చేయించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లనూ ఎవరు మర్చిపోలేరని పేర్కొన్నారు. 

దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ పత్రికకు రాసిన వ్యాసంలో థరూర్ ఈ విషయాలను ప్రస్తావించారు. సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరు అత్యంత క్రూరంగా ఉందని, ఆయన చర్యలు మాటల్లో చెప్పలేని హింసకు దారితీశాయని తీవ్రంగా విమర్శించారు. ఎమర్జెన్సీని కేవలం ఒక మరపురాని ఘట్టంగా కాకుండా, ఓ గుణపాఠంగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. "1975–-77 మధ్యకాలంలో సంజయ్ గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. 

నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి హింసను మార్గంగా ఎంచుకున్నారు. అదుపులేని అధికారం నిరంకుశత్వానికి ఎలా దారితీస్తుందో ఆనాటి ఘటనలు నిరూపించాయి. ఆ గాయాలను ఎవరూ మర్చిపోలేరు" అని థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ లాంటి నగరాల్లో మురికివాడలను కనికరం లేకుండా కూల్చివేశారని, వేలాది మందిని నిరాశ్రయులను చేశారని గుర్తుచేశారు.

 పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేసి, భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా హరించడం భారత రాజకీయాల్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చీకటి రోజుల నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని శశిథరూర్ పిలుపునిచ్చారు. 

ఎగిరే పక్షి.. చిలుకైంది: మాణిక్కం ఠాగూర్

ఎంపీ శశిథరూర్ వ్యాసంపై కాంగ్రెస్​ ఎంపీ మాణిక్కం ఠాగూర్​ స్పందించారు. శశిథరూర్​ పేరు ప్రస్తావించకుండా ‘పక్షి చిలుకైంది”అని వ్యంగ్యంగా విమర్శించారు. స్వేచ్ఛగా ఎగిరే పక్షి.. బీజేపీ మాటలను యథాతథంగా చెప్తూ పంజరంలో చిలకలా మారిందని ఎక్స్​వేదికగా ఎద్దేవా చేశారు. పక్షులలో మిమిక్రీ అందంగా ఉంటుందని, కానీ రాజకీయాల్లో బాగుండదని ఆయన హితవు పలికారు.

ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుంది: బీజేపీ 

కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని సమర్థిస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. థరూర్ వ్యాసంపై కాంగ్రెస్ నేతల విమర్శలకు స్పందిస్తూ.. ఎమర్జెన్సీ దారుణాలను గుర్తించడానికి కాంగ్రెస్ నేతకు 50 ఏండ్లు పట్టిందని.. కానీ, ఆ పార్టీలోని పెద్దలు ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని సమర్థిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ బిహార్ నిరసనలో చేసిన వ్యాఖ్యలు కూడా రాజ్యాంగ సంస్థల హక్కులను ఎన్నికల ఫలితాల ఆధారంగా నిర్ణయించాలనే మనస్తత్వాన్ని సూచిస్తుందన్నారు.