హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో .. చేరికలపై కాంగ్రెస్ ఫోకస్

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో .. చేరికలపై కాంగ్రెస్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా చేరికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం.. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు రావడంతో హస్తం నేతలు అలర్ట్ అయ్యారు. త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యతను సాధించే దిశగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్  నేతలను పార్టీలో చేర్చుకోవడం పై దృష్టి పెట్టారు. 

 వారం, పది రోజులుగా గ్రేటర్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రేవంత్ రెడ్డి ముందు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి లోక్ సభ సీట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. వరుస చేరికలతో ప్రత్యర్థి పార్టీల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ లో అంతా అయోమయం, గందరగోళం కొనసాగుతోంది. జీహెచ్​ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దిన్  కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో ప్రారంభమైన చేరికలు.. ఇప్పుడు తాజాగా తీగల కృష్ణారెడ్డి చేరిక వరకు కొనసాగాయి. 

రెండు జిల్లాల్లో మారిన పొలిటికల్ ​సీన్ 

హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్, బీజేపీ కన్నా బలంగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు ఈ రెండు పార్టీల కన్నా వెనుకబడి పోయింది. తాజాగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పా ర్లమెంట్ ఎన్నికల వాతావరణం మారింది. దీంతో బీఆర్ఎస్ నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇందులో భాగంగానే జీహెచ్​ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి, ఆమె భర్త శోభన్, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ  చేరికలతో ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్.. అటు చేవెళ్ల, మాల్కాజిగిరి, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన పట్టును తిరిగి సాధించుకోగలిగింది.