ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్..మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచేలా వ్యూహాలు

 ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్..మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచేలా వ్యూహాలు
  • రంగంలోకి దిగిన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు
  • బీజేపీ, బీఆర్ఎస్ నుంచి చేరికలపై దృష్టి
  • 10 నుంచి 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. దక్షిణ తెలంగాణలో ఆ పార్టీ బలంగా ఉంది. ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో అక్కడ బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో చేరికలను స్పీడప్ చేయాలని నిర్ణయించింది.

కనీసం 10 నుంచి 12 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా సీఎం రేవంత్​ను కలిసి పార్టీ పరిస్థితిపై సర్వే రిపోర్టు అందజేశారు. దక్షిణాది జిల్లాల్లో కాంగ్రెస్ బలంగానే ఉన్నా.. ఉత్తరాదిన మాత్రం ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఆ సర్వేలో సూచించారు. దీంతో రేవంత్ ఇక.. ఉత్తర తెలంగాణలోని బీజేపీ, బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది.

నార్త్​లో కాంగ్రెస్ వర్సెస్ కమలం!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 8 స్థానాల్లో గెలిచింది. వీటిలో ఏడు సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. మిగిలిన ఒక సీటు మాత్రమే హైదరాబాద్ సిటీలో ఉంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకుంటే.. అందులో మూడు సీట్లు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. నార్త్​లో కమలానికి కొంత పట్టు ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు పోటీ కొనసాగనుంది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్​కు పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడేలా ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దించారు. నార్త్ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుపొందాలంటే.. ఏం చేయాలనే దానిపై సునీల్ టీం జనం నాడీని తెలుసుకునే పనిలో పడింది. 

ఇతర పార్టీల్లోని బలమైన నేతలపై దృష్టి

నార్త్ తెలంగాణలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​లో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన బలమైన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. గ్రామ, మండల, అసెంబ్లీ స్థాయిలో పట్టున్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా అక్కడ తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే విశ్వాసంతో హస్తం పెద్దలు ఉన్నారు.

ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేందుకు సునీల్ టీం ఇచ్చే సర్వే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ రూపొందించుకోనున్నట్టు తెలుస్తున్నది. ఈలోపు జాయినింగ్స్ ను స్పీడప్ చేసి కాంగ్రెస్ కు ఊపు తేవాలనే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.