‘రాజ్యసభ’పై కాంగ్రెస్ ఫోకస్.. రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు ఖాళీ

‘రాజ్యసభ’పై కాంగ్రెస్ ఫోకస్.. రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు ఖాళీ
  • కాంగ్రెస్‌‌ నుంచి అభిషేక్‌‌ మనుసింఘ్వీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి కేఆర్‌‌‌‌ సురేశ్‌‌రెడ్డి పదవీకాలం ముగింపు 
  • ఆ రెండూ కాంగ్రెస్‌‌ ఖాతాలోకే.. 
  • ఒకటి సింఘ్వీకి తిరిగి రెన్యూవల్‌‌!
  • మిగిలిన ఒక్క స్థానానికి జస్టిస్ సుదర్శన్‌‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సీఎంవో లీకులు 
  • ఆ ఒక్క సీటుపై డజన్‌‌ మందికిపైగా సీనియర్ల ఆశలు

హైదరాబాద్, వెలుగు:  ఈ ఏడాది ఏప్రిల్‌‌తో ఖాళీ అవుతున్న  2 రాజ్యసభ సీట్లపై కాంగ్రెస్‌‌ ఫోకస్‌‌ పెట్టింది. ఈ సీట్ల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్  విడుదల చేయడంతో కసరత్తు మొదలుపెట్టింది. కే కేశవరావు రాజీనామాతో ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ సభ్వత్వం దక్కగా.. ఇప్పుడు ఆ సీటు ఖాళీ అవుతున్నది.  బీఆర్ఎస్‌‌కు చెందిన కేఆర్ సురేశ్‌‌రెడ్డి  పదవీకాలం కూడా ముగియనుండడంతో రెండో సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకే చేరబోతున్నది.  

ఈ రెండు స్థానాల్లో.. అభిషేక్ మను సింఘ్వీ సీటును తిరిగి ఆయనకే రెన్యూవల్ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. సుప్రీంకోర్టులో న్యాయపరమైన సేవలు రాష్ట్రానికి అవసరం ఉన్నందున సింఘ్వీని తిరిగి కొనసాగించడం అనివార్యమని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఇక మిగిలిన ఒక్క సీటు కూడా జస్టిస్ సుదర్శన్‌‌రెడ్డికి ఇవ్వాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి హైకమాండ్‌‌కు పంపించనున్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నది.


ఇటీవల ఉప రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో జస్టిస్‌‌‌‌ సుదర్శన్‌‌‌‌రెడ్డి.. ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తి చూపిస్తున్నట్టు సీఎంవో నుంచి బుధవారం లీకులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో రెండో సీటు కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి రూపంలో పోనుండడంతో ఇతరులకు రాజ్యసభ సభ్యత్వం దక్కడం అనుమానమేననే చర్చ పార్టీలో నడుస్తున్నది. 

ఒక్క స్థానంపై సీనియర్ల ఆశ..

ఒక్క రాజ్యసభస్థానంపై పార్టీ సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.  ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో సీఎం రేవంత్‌‌‌‌కు సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేకే, జీవన్‌‌‌‌రెడ్డి, చిన్నారెడ్డి, వంశీ చంద్‌‌‌‌రెడ్డి, మధుయాష్కీ, సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, హర్కర వేణుగోపాల్‌‌‌‌ రావు ఉన్నట్టు తెలిసింది. నిన్నటి వరకు వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపిన సీఎం.. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ను రాష్ట్రం నుంచి ప్రతిపాదించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం నడుస్తున్నది.  

ఇక బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన కేకే కాంగ్రెస్‌‌‌‌ లో చేరే సమయంలో ఆ పదవిని వదులుకున్నారు. ఆ స్థానంలోనే కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ నియమితులయ్యారు. ఇప్పుడు కూడా తిరిగి ఆయనకే రెన్యూవల్ చేయనుండడంతో మరో సీటు కోసం కేకే తన ప్రయత్నాలను ప్రారంభించారు. జీవన్‌‌‌‌ రెడ్డి కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. జగిత్యాలలో తనకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌ని పార్టీలోకి చేర్చుకోవడంతో గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఇప్పుడు ఈ సీటుపై కన్నే సినట్టు ప్రచారం సాగుతున్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​కు సన్నిహితుడనే ముద్రపడిన మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా రాజ్యసభ సభ్యత్వంపై ఆశలు పెట్టుకున్నారు.

 రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్  చిన్నారెడ్డి కూడా రాజ్యసభ సీటును అడుగుతున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తున్నది. మైనార్టీ కోటాలో సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రయత్నిస్తున్నారు. మహిళా కోటాలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్ నేరెళ్ల శారద కూడా తనకున్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరో రెండు నెలల్లో ఈమె పదవీకాలం ముగియనుండడంతో రాజ్యసభ సభ్యత్వంపై ఆశలు పెంచుకున్నారు. ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా ఈ పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. 

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్ ద్వారా ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇక ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ద్వారానే రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎస్టీ కోటాలో రాష్ట్ర గిరిజన సంక్షేమ సంస్థ చైర్మన్ బెల్లయ్యనాయక్ ఈ సీటును ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌‌‌‌రావు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరి రెండో సీటు జస్టిస్ సుదర్శన్ రెడ్డికే దక్కనుందా? లేదంటే రేసులో ఉన్న ఈ డజను మందిలో మరెవరికైనా వరించనుందా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌లో జోరుగా సాగుతున్నది.

ఆశావహులు వీరే:
వేం నరేందర్‌‌‌‌రెడ్డి, కే కేశవరావు, 
జీవన్‌‌రెడ్డి, మధుయాష్కీ, చిన్నారెడ్డి, 
షబ్బీర్‌‌‌‌ అలీ, సంపత్ కుమార్‌‌‌‌, బెల్లయ్య నాయక్, 
వంశీచంద్ రెడ్డి,  నేరెళ్ల శారద, హర్కర