కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ టీంలో పీకే మాజీ సహచరుడు

కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ టీంలో పీకే మాజీ సహచరుడు

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పొలిటికల్ ఎపైర్స్, టాస్క్ ఫోర్స్- 2024, సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్ లు ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంలో గతంలో పనిచేసిన సునీల్ కనుగోలుకు టాస్క్ ఫోర్స్ టీంలో చోటు కల్పించారు. మొత్తం 8 మందితో టాస్క్ ఫోర్స్ టీంలో ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ప్రియాంక, సునీల్ కనుగోలుతో పాటు  చిదంబరం, ముఖుల్ వాస్నిక్, జైరామ్ రమేష్, కేసీ వేణు గోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సుర్జేవాలాను కమిటీలో సభ్యులుగా నియమించారు.

ఇక పొలిటికల్ ఎఫైర్స్ గ్రూప్ లో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జీతేంద్ర సింగ్ లకు చోటు కల్పించారు. రెబల్ నేతలుగా పేరున్న ఆజాద్, ఆనంద్ శర్మ కు ఈ గ్రూప్ లో స్థానం కల్పించడం విశేషం. ఇక పార్టీకి పునర్వైభవం కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ యాత్రలో నిరుద్యోగ, ప్రజా సమస్యలను హైలెట్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్ బాధ్యతలను దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలెట్, శశి థరూర్, రవ్ నీత్ సింగ్ బిట్టు, కేజే జార్జ్, జోతిమణి, ప్రద్యుత్ బోర్డోలోయ్, జితు పట్వారీ,సలీం అహ్మద్ లకు అప్పగించారు.