నిరుద్యోగులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేసిండు: పొన్నం ప్రభాకర్

నిరుద్యోగులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేసిండు: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే కొత్త రాష్ట్రానికి వరుసగా రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్... నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టిన విద్యార్థులను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్... రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే.. ఉన్న ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల నోరు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలె

ప్రభుత్వం ద్వారా లబ్ది పొందుతున్న ప్రైవేట్ కంపెనీల్లో 75 ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని.. కానీ రాష్ట్రంలో మాత్రం వాటి ఊసే లేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా యువకులు మద్యం, గంజాయికి అలావాటు పడి.. క్రిమినల్స్ లా తయారయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సమస్యపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని, లేకుంటే యువత నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో  ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, మేధావులు ప్రశ్నిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు భయపడేవని, కానీ ఇవాళ అలా ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కార్మికుల తరఫున పోరాడేవారు కార్మిక మంత్రులుగా ఉండేవారన్న పొన్నం ప్రభాకర్... కానీ ఇవాళ కార్మికులను దోచుకుంటున్న మల్లారెడ్డి లాంటి వాళ్లు కార్మిక మంత్రులుగా ఉంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెడతామని, రానున్న రోజుల్లో ప్రజలను చైతన్య పరిచేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.