- ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా చేస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
కోడేరు(పెద్దకొత్తపల్లి), వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి, మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి లారీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంటను వెంటనే తూకం వేయాలని, పారదర్శకంగా కొనుగోళ్లు జరిపి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు తమ పంటను ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా దళారుల బెడద తప్పుతుందని, రవాణా ఖర్చులు తగ్గి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

