
బషీర్బాగ్, వెలుగు: స్వాతంత్య్రానికి ముందు కులాలతో సంబంధం లేకుండా మహిళలే అత్యంత వివక్షకు గురయ్యారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. నిజాం కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ అనే అంశంపై గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే సమాజంలో నిలదొక్కుకోగలరన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అండగా ఉందని, ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నామని చెప్పారు.
మహిళలు తయారు చేసే ఉత్పత్తులు విక్రయించేందుకు హైటెక్ సిటీలో ఒక స్థలాన్ని గుర్తించి అక్కడ షాపుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణంతో పాటు మహిళలను ఆ బస్సులకు యజమానులుగా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మహిళలు అందిపుచ్చుకొని పురుషులతో పోటీగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
కాన్వాయ్ అడ్డగింతకు యత్నం
కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు , ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజాం కాలేజీ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకొని , అరెస్ట్ చేశారు.