తాగునీరు, కరెంట్​పై సర్కారు అలర్ట్

తాగునీరు, కరెంట్​పై సర్కారు అలర్ట్
  • డెడ్ స్టోరేజ్ లోనూ నీళ్లు తీసుకునేందుకు బూస్టర్​ పంప్స్
  • కరెంట్ ఎంత పీక్  డిమాండ్​ ఉన్నా.. కోతలు ఉండొద్దు 
  • ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు 

హైదరాబాద్​, వెలుగు: తాగునీరు, విద్యుత్  సరఫరాపై రాష్ట్ర సర్కారు ఫోకస్  పెట్టింది. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ విడుదలవడం, కోడ్​ అమల్లోకి రావడంతో విద్యుత్, తాగునీటిపై అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. వేసవికాలం కావడంతో విద్యుత్​ డిమాండ్  పీక్ గా ఉంటోంది. మరోవైపు కొన్ని నెలలుగా వర్షాలు లేకపోవడంతో కరువు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల అవసరం లేకున్నా కరెంట్   కోతలు విధించడం, వీఐపీ మీటింగ్స్​లోనూ కరెంట్​ పోతుండడం వంటివి ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. తాగునీటి విషయంలోనూ బెంగళూరుతో పోలుస్తూ సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండడాన్ని సర్కారు సీరియస్​గా తీసుకొంది.  ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి విషయంలో సమస్య లేకుండా ముందుకు వెళ్తున్నది. అధికారులు ఇప్పటికే ఆ మేరకు చర్యలు మొదలుపెట్టారు. 

కరెంట్​పై సోషల్​ మీడియాలో యాక్టివ్​

వేసవికాలం కావడంతో విద్యుత్​ డిమాండ్​ పీక్స్​లోకి వెళ్తున్నది. రోజూ 300 మిలియన్​ యూనిట్లు దాటుతోందని అధికారులు చెబుతున్నారు.  దీంతో కరెంట్​ కోతలు లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఇందు కోసం సోషల్​ మీడియాలో టీఎస్​ఎస్పీడీసీఎల్, టీఎస్​ఎన్పీడీసీఎల్​ యాక్టివ్​ అయ్యాయి. ఎక్కడైనా కరెంట్​ తీయాలంటే ముందస్తుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా ఏరియాల్లో వాట్సాప్​ గ్రూప్స్​లో సమాచారం ఇవ్వడంతో పాటు ట్విటర్​లోనూ అప్​డేట్  చేస్తున్నారు.

సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన కరెంట్​ కట్ చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రిపేర్ల వల్ల కరెంట్  సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే వినియోగ‌‌దారుల‌‌కు స‌‌మాచారం ఇవ్వాలి. ఐదు నిమిషాల‌‌కు మించి విద్యుత్  స‌‌ర‌‌ఫ‌‌రా నిలిచిపోతే వెంటనే కార‌‌ణాల‌‌ను రివ్యూ చేయాలి. మరో 15 రోజుల దాకా జాగ్రత్త పడితే వరి కోతలు వస్తాయి. దీంతో కొంత అయినా కరెంట్ లోడ్​ తగ్గుతుందని, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆఫీసర్లు చెబుతున్నారు.

తాగునీటిపై సమన్వయంతో ముందుకు

నాగార్జునసాగర్‌‌  నుంచి పాలేరు రిజర్వాయర్‌‌కు ఏప్రిల్‌‌లో 2.5 టీఎంసీలు విడుదల చేస్తే జూన్‌‌ వరకు సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక నాగార్జునసాగర్‌‌లో  తెలంగాణ వాటా 7 టీఎంసీలు ఉంది. హైదరాబాద్‌‌కు తాగునీటి సరఫరాతో కలిపి 11 టీఎంసీలు అవసరమని నిర్ధారించారు. దీంతో కనీస నీటిమట్టం 510 అడుగుల దిగువన 505 అడుగుల వరకు తీసుకోవడానికి కేఆర్ఎంబీకీ సమాచారం అందించారు. డెడ్​స్టోరేజీ​లోనూ నీటిని తీసుకొనేలా బూస్టర్​ పంప్స్​ను అందుబాటులో ఉంచారు.

నారాయణపూర్‌‌  నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదలకు కర్నాటకకు లేఖ రాయడంతో పాటు సంప్రదింపులు జరపాలని  అధికారులు భావిస్తున్నారు. నీటిపారుదల, పంచాయతీ రాజ్‌‌, పురపాలక శాఖల అధికారులు  సమన్వయంతో ముందుకు వెళ్లడం ద్వారా సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నారు. రిజర్వాయర్ల వారీగా ఏప్రిల్‌‌  30 తర్వాత 3 నెలల అవసరాలు ఎంత? ఎక్కడ కొరత ఉంటుంది? కొరత ఉన్న చోట ఏం చేయాలి? అనే దానిపై యాక్షన్​ ప్లాన్​ రెడీ చేసుకున్నారు.  గతంలో వదిలేసిన అనేక నీటి వ‌‌న‌‌రుల‌‌ను వినియోగంలోకి తెచ్చే అవ‌‌కాశాలనూ ప‌‌రిశీలించారు.