ఎట్టకేలకు భద్రాచలానికి మినీస్టేడియం వస్తోంది .. మనుబోతుల చెరువులో 5 ఎకరాలు కేటాయింపు

ఎట్టకేలకు భద్రాచలానికి మినీస్టేడియం వస్తోంది .. మనుబోతుల చెరువులో 5 ఎకరాలు కేటాయింపు
  • ఐటీడీఏ పీవో బి.రాహుల్​ చొరవతో గ్రామసభ నిర్వహించి పంచాయతీ తీర్మానం 
  • కలెక్టర్​కు స్థలం అప్పగించిన గ్రామపంచాయతీ 
  • 2017లోనే  రూ.2.65కోట్ల నిధులు మంజూరు

భద్రాచలం, వెలుగు :  ఎట్టకేలకు భద్రాచలానికి మినీస్టేడియం వస్తోంది. క్రీడాకారుల ఏండ్లనాటి కల నెరవేరబోతోంది. భద్రాచలం గ్రామపంచాయతీకి చెందిన మనుబోతుల చెరువు వద్ద ఉన్న సర్వే నెంబర్​ 95/2లోని 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఐటీడీఏ పీవో బి.రాహుల్​ చొరవతో గ్రామసభ నిర్వహించి పంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్​కు అప్పగించారు. జిల్లా యువజన, క్రీడలశాఖకు ఆ భూమిని కేటాయిస్తే టెండర్లు పిలిచి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. 2017లో రూ.2.65కోట్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ తెలంగాణ నిధులను మంజూరు చేసింది. స్థలం కేటాయించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మినీ స్టేడియం ఏర్పాటుకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఎనిమిదేండ్లుగా నిధులు మూలుగుతున్నాయి. కొత్త సర్కారు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడంతో మళ్లీ మినీస్టేడియం నిర్మాణం పనులకు గ్రహణం వీడింది.

2012 క్రీడాపాలసీ ప్రకారం మినీ స్టేడియాలు..  

2012 క్రీడాపాలసీ ప్రకారం రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి మినీ స్టేడియం మంజూరు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ తెలంగాణ 2017లో నిధులు విడుదల చేసింది. పినపాక నియోజకవర్గంలో భట్టుగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకర్గంలో పాల్వంచలో స్థలాలు కేటాయించగా పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ నిధులు సరిపోక పోతే స్థానిక ఎమ్మెల్యేలు అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. కానీ ఒక్క భద్రాచలంలోనే స్థలం లేక పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కలెక్టర్​, ఐటీడీఏ పీవోల చొరవతో భద్రాద్రి వాసులకు స్టేడియం ముచ్చట తీరనుంది. 

క్రీడాకారులకు వరం... 

భద్రాచలంలో ప్రభుత్వ జూనియర్​ కాలేజీకి చెందిన గ్రౌండ్​ ఒక్కటే ఉంది. ఇందులోనే జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు జరుగుతుంటాయి. వాకర్స్ కు కూడా ఈ గ్రౌండే ఆధారం. గిరిజన క్రీడాకారులకు ట్రైనింగ్​లు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మినీ స్టేడియం నిర్మాణం పూర్తయితే క్రీడాకారులకు వరంగా మారనుంది. భద్రాచలం మన్యం నుంచి అథ్లెట్స్ పలువురు ప్రస్తుతం జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ఆర్చరీ క్రీడాకారులకు కొదవలేదు. వీరందరికీ ఈ స్టేడియంలో ట్రైనింగ్​ ఇచ్చేందుకు దోహదపడుతుంది. వారి ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు వీలుకలుగుతుంది.

టెండర్లు పిలుస్తాం

భద్రాచలంలో మినీస్టేడియం నిర్మాణానికి స్థలం లేక ఇంతకాలం ఆగింది. ప్రస్తుతం స్థలాన్ని కేటాయిస్తుండటంతో త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపడతాం. 2017లోనే నిధులు మంజూరయ్యాయి. 

పరంధామరెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆఫీసర్​ 

సంతోషంగా ఉంది

భద్రాచలం క్రీడలకు ప్రధాన కేంద్రం. గ్రౌండ్​ లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా మినీస్టేడియం నిర్మాణానికి నోచుకోవడం సంతోషంగాఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించడానికి ఈ స్టేడియం ఉపయోగపడుతుంది.

సలీం, క్రీడాకారుడు, భద్రాచలం