చినుకు..చింత .. కామారెడ్డి జిల్లాలో 12 మండలాల్లో లోటు వర్షపాతం

చినుకు..చింత .. కామారెడ్డి జిల్లాలో 12 మండలాల్లో లోటు వర్షపాతం
  • ఇప్పటి వరకు 270 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా, కురిసింది 220 మి.మీ.

కామారెడ్డి, వెలుగు : ముందు మురిపించిన వానలు ముఖం చాటేశాయి. వారం, పది రోజులుగా కామారెడ్డి జిల్లాలో చినుకు  జాడ లేక రైతులు చింతిస్తున్నారు. 25 మండలాలకు గాను 12  మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాధార పంటలు  వాడిపోతున్నాయి.  ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.    వర్షంపై ఆధారపడిన మక్క, పత్తి, సోయా, పప్పుదినుసులు, వరి పంటలకు తడులు లేక రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. మొలక ఎదిగే దశలో వానలు లేక పోవడంతో  రైతులు ఆందోళనకు గురవుతున్నారు.  

లోటు  వర్షపాతం ఉన్న మండలాలు.. 

జిల్లాలో ఈ ఏడాది నార్మల్ వర్షపాతం  983. 4 మి.మీ.  గురువారం వరకు   270.1 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 220.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. మొత్తం 25 మండలాలు ఉండగా, ఇందులో 12 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. పెద్దకొడప్​గల్, బిచ్​కుంద, నాగిరెడ్డిపేట,  ఎల్లారెడ్డి, లింగంపేట,  దోమకొండ,  బీబీపేట, పాల్వంచ, మహ్మద్​నగర్​,  బాన్సువాడ, పిట్లం, నిజాంసాగర్ లో  లోటు వర్షపాతం ఉంది. అత్యధికంగా పిట్లంలో 49.9  శాతం , పెద్దకొడప్​గల్​లో 41.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు  కలిపి 2069 ఉంటే ఇందులో సగం వాటిలో 25 శాతం మేర నీళ్లు లేవు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో కూడా అంతగా నీళ్లు లేవు. ఈ ప్రాజెక్టు కింద ఇంకా నాట్లు షురూ కాలేదు. నిజాంసాగర్​ ప్రాజెక్టు కింద నాట్లు వేశారు. ఇందులో ప్రస్తుతం 4 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నాయి.   

పంటల పరిస్థితి.. 

లోటు వర్షపాతం ఉన్న మండలాల్లో ఎక్కువగా మక్క, పత్తి, సోయా, వరి పంటలు సాగవుతున్నాయి. మక్క, సోయా, పత్తి పంటలు కొన్నిచోట్ల వాడిపోతున్నాయి.    చెరువులు, కుంటల కింద వరి నారు ముదిరిపోతుంది. బోరు బావుల కింద మాత్రమే వరి నాట్లు వేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో బోర్లలో నీటి ధారలు తగ్గే అవకాశముంది.  

పంటల సాగు వివరాలు.. 

వానాకాలం సీజన్​లో పంటల సాగు అంచనా 5,21,448 ఎకరాలు ఉండగా, ఇప్పటి వరకు 2,71,087 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.  ప్రధానంగా వరి పంట ఉండగా  సాగు అంచనాలో 33 శాతం అయ్యింది.  ఇంకా చెరువులు, కుంటలు, పోచారం ప్రాజెక్ట్​ కింద నాట్లు వేయాల్సి ఉంది. బోర్ల కింద వేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఇంకా బోర్లు కింద నాట్లు 
వేస్తున్నారు.    

పంట    సాగు విస్తీర్ణం    ఇప్పటి వరకు అంచనా ఎకరాల్లో..    సాగు ఎకరాల్లో..

వరి    3,18,530    91,500
మక్క    52.016    43,651
సోయా    84,220    77,124
పత్తి    34,549    30.958
కంది    21,300    23,214
మినుము    2993    1917
పెసర    4337    2723