ములుగు జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సీతక్క
  • వడ్డీ లేని రుణాలతో భరోసా 
  • బొంగు చికెన్​ తయారీలో శిక్షణనిస్తాం
  • పంచాయతీరాజ్ శాఖ     మంత్రి సీతక్క
  • ములుగులో ఇందిరా మహిళా శక్తి సంబురాలు 

ములుగు, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారు అన్ని రంగాల్లో ఎదిగేలా స్వయం సహాయక సంఘాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సెర్ప్​అడిషనల్ సీఈవో పి.కాత్యాయనీదేవి, కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​రేగా కల్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ తో కలిసి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు సుమారు రూ.26 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ రంగంలో పలు వ్యాపారాలు చేస్తూ మహిళలు రాణించడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బొంగు చికెన్​కు గిరాకీ ఎక్కువగా ఉందని, తయారీలో శిక్షణనిస్తామని పేర్కొన్నారు.

రూ.10.74 కోట్ల వడ్డీ లేని రుణాలు

ములుగు నియోజకవర్గంలో 9 మండల సమాఖ్యలు, 330 గ్రామ సమాఖ్యలు, 6,904 స్వయం సహాయక సంఘాల్లో 69,736 మంది సభ్యులు ఉన్నారని మంత్రి తెలిపారు. బ్యాంక్​లింకేజీ ద్వారా 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.49 కోట్లు, 2025-–26 ఆర్థిక సంవత్సరానికి గానూ 618 సంఘాలకు రూ.5.4 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. రుణాలు పొంది సక్రమంగా చెల్లిస్తున్న 5,109 సంఘాల్లోని సభ్యులకు రూ.8.84 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. నేడు మరో 52,615 మందికి రూ.10.74 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

వ్యవసాయ అనుబంధ జీవనోపాధి కల్పన కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించి, ఆర్థిక చేయూతనిచ్చామన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా వ్యాపారాలు చేస్తూ మహిళలు రూ.వేలల్లో సంపాదిస్తున్నారని, ఆర్టీసీకి పెట్టిన అద్దె బస్సుల ద్వారా నెలకు రూ.75 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అడిషనల్​కలెక్టర్ సంపత్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాపారం రంగంలో మహిళలదే పైచేయి కావాలి

జనగామ అర్బన్, వెలుగు:  ప్రతీ మహిళ ఆర్థికాభివృద్ధి సాధించాలని, వ్యాపార రంగంలో మహిళలదే పైచేయి కావాలని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓంసాయి గార్డెన్​లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్​, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, అడిషనల్ కలెక్టర్​ పింకేశ్​ కుమార్, మహిళలతో కలిసి ఆయన కేక్​కట్​చేశారు. మహిళలందరూ కోటిశ్వరులు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేయూతనిస్తున్నందున పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆగస్టు 15 లోగా 50 వనిత టీ స్టాళ్లు ప్రారంభించాలని సూచించారు. అడిషనల్​ డీఆర్డీవో నూరుద్దీన్​, డీపీఎం నళిని నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.