హైడ్రాకు ఏడాది .. అనతి కాలంలోనే ఆశాజనక ఫలితాలు

హైడ్రాకు ఏడాది .. అనతి కాలంలోనే ఆశాజనక ఫలితాలు
  •  
  • గతంలో ఎన్నడూ లేని విధంగా బుల్డోజర్ చర్యలు
  • 581 చోట్ల ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌ తొల‌‌‌‌గింపు 
  • 499 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
  • పైలట్ ప్రాజెక్టులో ఆరు చెరువులకు పునరుజ్జీవం
  • త్వరలో 950 చెరువుల బౌండరీలు ఫిక్స్
  • డిజాస్టర్ రెస్సాన్స్​లోనూ దూకుడు

 హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రాకు ఈ నెల 19తో ఏడాది పూర్తవుతోంది. ఈ కొద్ది కాలంలోనే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వైపు కబ్జాదారులు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టించే పరిస్థితి తీసుకొచ్చింది. అటు ప్రజల్లోనూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించింది. పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్ పాత్​ల వంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బుల్డోజర్ చర్యలు తీసుకుంటోంది.

ఎవర్నీ వదల్లేదు..

తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ చెరువుల ఆక్రమణలను నివారిస్తామని, హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీటిలా చేస్తామని హామీలిచ్చినప్పటికీ, ఆ పనులు జరగలేదు. ఎన్​కన్వెన్షన్ వంటి ఆక్రమణలను కూల్చివేస్తామన్నా చర్యలు తీసుకోలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే హైడ్రా ద్వారా చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. గతేడాది జూన్ 27న ఫిల్మ్​నగర్‌‌‌‌లోని కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద లోటస్ పాండ్ పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్​ను కూల్చడంతో హైడ్రా యాక్షన్ మొదలైంది. అప్పట్నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు ఇలా ఎవరి ఆక్రమణలు వదల్లేదు. 

ఏడాది కాలంలో 581 చోట్ల ఆక్రమ‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌ను తొల‌‌‌‌గించి 499 ఎక‌‌‌‌రాల ప్రభుత్వ భూమిని కాపాడింది. దాదాపు రూ. 30 వేల కోట్ల ఆస్తుల‌‌‌‌ను పరిర‌‌‌‌క్షించింది. ఇందులో 360 చెరువుల ఆక్రమణలను తొలగించి 133 ఎకరాలు, లేఅవుట్, తదితర కాలనీల్లో 86 చోట్ల ఆక్రమణలను తొలగించి 123 ఎకరాలు, 20 నాలాల ఆక్రమణలను తొలగించి 8 ఎకరాలకు పైగా, 74 రహదారుల ఆక్రమణలను తొలగించి 218.30 ఎకరాలు, 38 పార్కుల ఆక్రమణలను తొలగించి 10.65 ఎకరాలను కాపాడింది. అలాగే 5.94 ఎకరాల్లో అనధికార నిర్మాణాలను కూల్చేసింది.

ఆరు నుంచి 9 నెలల్లో బౌండరీలు ఫిక్స్..

హైడ్రా పరిధిలో 950 చెరువులుండగా, బౌండరీలకు సంబంధించి150 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్, 500 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. మరో 200 చెరువులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఖరారు చేసి, ఆక్రమణలు లేకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నిపుణుల సలహాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. చెరువుల పరిశీలనకు శాటిలైట్ మ్యాప్​ల కోసం ఎన్ఆర్‌‌‌‌ఎస్​సీతో ఒప్పందం చేసుకున్నారు. అమెరికన్ శాటిలైట్ మ్యాప్​ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. భవిష్యత్తులో రోజువారీ శాటిలైట్ మ్యాప్​లతో చెరువుల పరిస్థితిని గమనించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వ్యర్థాల డంపింగ్​​కు అలెర్ట్ సిస్టమ్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటుతోపాటు ప్రభుత్వ ఆస్తుల డిజిటలైజేషన్, జియో ట్యాగింగ్ కూడా​ చేస్తున్నారు. 

ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో..

చెరువుల రక్షణతో పాటు నగరంలో వరదల నివారణ, ఫైర్ సేఫ్టీ వంటి డిజాస్టర్ రెస్పాన్స్ బాధ్యతలను హైడ్రా నిర్వహిస్తోంది. వరదల కారణాలను అధ్యయనం చేసి, నివారణ చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుతం 51 డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌‌‌‌లు ఏర్పాటు చేయగా, వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా ఈ బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై కమిషనర్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకుంటున్నారు. 

తిరిగి జీవం పోసుకుంటున్న చెరువులు..

హైడ్రా అంటే కూల్చివేతలు, భవనాల ధ్వంసమేనన్న భావన మొదట్లో ఉండగా, అవేవీ పట్టించుకోకుండా చెరువుల పరిరక్షణ కోసం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. పైలట్ ప్రాజెక్టులో ఆరు చెరువులను అభివృద్ధి చేయాలని ఎంపిక చేయగా, మొదటగా అంబర్​పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తున్నది.1962–63 లెక్కల ప్రకారం ఈ చెరువు 14 ఎకరాల 6 గుంటలు, బఫర్ జోన్​తో కలిపి 16 ఎకరాల 13 గుంటలుగా ఉండేది. ఆక్రమణల కారణంగా తగ్గి, తాజా హైడ్రా సర్వే ప్రకారం 5 ఎకరాల 15 గుంటలు మాత్రమే మిగిలింది. 

కోర్టు కేసులను ఎదుర్కొని, చెరువు భూమిగా నిర్ధారణ అయిన తర్వాత.. హైడ్రా రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, రాళ్లతో గట్టు ఏర్పాటు చేస్తూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి మొత్తం పనులు పూర్తవనున్నాయి. 

అలాగే మాదాపూర్ సున్నం చెరువు 14.09 ఎకరాలు, తమ్మిడి కుంట 13.02 ఎకరాలు, ఉప్పల్ నల్లచెరువు 14.81 ఎకరాలు, పాతబస్తీలోని బుమ్ రుక్ నుద్దౌలా 12.54 ఎకరాలు, కూకట్ పల్లి నల్ల చెరువుకు 15.26 ఎకరాల్లో పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఇప్పటికే పనులు ప్రారంభించింది.