రక్షణ రంగంలో తొలి స్కామ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మోడీ

 రక్షణ రంగంలో తొలి స్కామ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మోడీ

హిమాచల్ ప్రదేశ్ వేసే ఓటు 25 ఏళ్ల భవిష్యత్తుకు బాట 
కాంగ్రెస్ ఎప్పుడూ అభివృద్ధిని పట్టించుకోలేదు
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

షిమ్లా: కాంగ్రెస్ పార్టీ జాతీయ భద్రతకే కాకుండా దేశాభివృద్ధికి వ్యతిరేకమని.. స్వాతంత్ర్యం తర్వాత రక్షణరంగంలో తొలి స్కాం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని  ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అధికారంలో ఉన్నంత కాలం రక్షణ రంగానికి చెందిన ఒప్పందాల్లో దళారీ వ్యవస్థను ప్రోత్సహించిందని మండిపడ్డారు.  హిమాచల్ ప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్న నమ్మకం ఉందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు పంజాబ్ లో పర్యటించిన ప్రధాని మోడీ.. అమృత్ సర్ లో రాధా సోమి సత్సంగ్ ఆశ్రమాన్ని సందర్శించారు. రాధా సోమి అధినేత బాబా గురీందర్ సింగ్ తో సమావేశమయ్యారు. అనంతరం హిమాచల్ కు వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లోని  మండి, సోలన్ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సమావేశాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు.

హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. తప్పుడు వాగ్దానాలు చేయడం, తప్పుడు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పాత ట్రిక్ అని విమర్శించారు. బీజేపీ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పారు. రక్షణ రంగంలో దళారి వ్యవస్థను ప్రోత్సహించిన కాంగ్రెస్  ప్రతి రక్షణ ఒప్పందంలో కమీషన్ల కోసం ఆ పార్టీ నేతలు ఆశపడ్డారని, అందుకే ఆయుధాల సేకరణ ఆలస్యమైందని మోడీ విమర్శించారు.

భారతదేశం ఆత్మనిర్భర్ గా మారాలని కోరుకుంటున్నామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలుస్తుందన్నారు. బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. 30 ఏళ్లపాటు కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు ఉన్నాయని, మళ్లీ మళ్లీ ఎన్నికలకు వెళ్లడం వల్ల వేల కోట్ల రూపాయలు వృథా అయ్యాయని తెలిపారు. 2014లో ప్రజలు సుస్థిర ప్రభుత్వానికి ఓటేశారన్నారు.  ప్రజల ఆశీర్వాదంతో హిమాచల్ ప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.