అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నరు

అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నరు
  • హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది: హరీశ్ రావు
  • ఉపాధి హామీ స్కీమ్​కు తూట్లు పొడుస్తున్నదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను నమ్మించేందుకు విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తున్నదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలందరిదీ ఒకేదారి అని ట్వీట్​లో విమర్శించారు. ‘‘మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. మంచిర్యాలలో మంచినీళ్లు తాగినంత సులువుగా మరోసారి అబద్ధాలు చెప్పారు. రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చామంటూ అదే పాత పాట పాడి వాళ్లను మోసం చేసే ప్రయత్నం చేశారు. బ్యాంకు లింకేజీ కల్పించి, మొత్తం రూ.21 వేల కోట్లూ వడ్డీ లేని రుణాలే అని ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ కే చెల్లింది. 

ఇదే విషయంపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు జీవో 27 ప్రకారం.. రూ.5 లక్షల వరకే వడ్డీలేని రుణాలిస్తున్నామని సమాధానం చెప్పిన మాట వాస్తవం కాదా? మిగతా రూ.15 లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నారన్నది నిజం. మహిళా సంఘాలకు స్వయంగా సీఎం 2 సార్లు చెక్కులు ఇచ్చినా అవి ఇప్పటికీ చెల్లుబాటు కావడం లేదు. స్టూడెంట్ల యూనిఫాం కుట్టుకూలీకి రూ.50 ఇచ్చి.. రూ.75 అని ప్రచారం చేసుకున్నరు. మేం నిలదీస్తేనే మిగతా రూ.25 రిలీజ్​ చేశారు. స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇచ్చే ‘శ్రీనిధి’ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 

మొత్తం రుణాల్లో 40% వాటా నాన్ -పెర్ఫార్మింగ్ అసెట్స్ ఉండటం శ్రీనిధి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది’’ అని హరీశ్ విమర్శించారు. ఉపాధి హామీ స్కీమ్ కు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదన్నారు. ఉపాధి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలు, సీవోలకు 3 నెలలుగా జీతాలు రావడం లేదని తెలిపారు. జీతాల చెల్లింపుల విషయంలో సీఎం, మంత్రులు చెప్తున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని మండిపడ్డారు.