దర్జాగా భూ కబ్జాలు.. శివ్వంపేట మండలంలో ప్రభుత్వ, ఫారెస్ట్, కుంట శిఖం భూములు కబ్జా చేసిన రియల్టర్లు

దర్జాగా భూ కబ్జాలు.. శివ్వంపేట మండలంలో ప్రభుత్వ, ఫారెస్ట్, కుంట శిఖం భూములు కబ్జా చేసిన రియల్టర్లు
  • ఫిర్యాదు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్యలు శూన్యం
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలపై కొరడా
  • రూ.20 కోట్ల విలువైన సుమారు 10 ఎకరాల భూమి స్వాధీనం

మెదక్/శివ్వంపేట, వెలుగు:  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సమీపంలో ఉండడం, రెండు నేషనల్ హైవేలు అందుబాటులో  ఉండడం, ప్రతిష్టాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు ఇక్కడి నుంచే వెళ్తుండడంతో జిల్లాలోని శివ్వంపేట మండలంలో భూములకు బాగా డిమాండ్ ఏర్పడింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటికల్ పార్టీ లీడర్లు, ఎన్ఆర్ఐలు ఈ మండల పరిధిలో ఉన్న భూముల కొనుగోలుకు ఆసక్తి చూపారు. గడిచిన ఏడెనిమిదేళ్లలో వందలాది ఎకరాల క్రయ విక్రయాలు జరిగాయి. 

పదుల సంఖ్యలో ఫామ్ హౌస్ లు, పలు ఫామ్ ల్యాండ్ వెంచర్లు వెలిశాయి. ఈ క్రమంలో పలువురు రియల్టర్లు తాము కొనుగోలు చేసిన పట్టా భూముల పక్కన ఉన్న ప్రభుత్వ, ఫారెస్ట్, కుంట శిఖం భూములను కబ్జా చేశారు. కొన్ని చోట్ల రోడ్లు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఆయా చోట్ల భూముల కబ్జాపై ప్రజలు, రైతులు, మత్స్య కారులు ఎన్నో మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చర్యలు కరువయ్యాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సైతం భూముల కబ్జాపై ఆయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సీఎం, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండ సురేఖకు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత శాఖల అధికారులు స్పందించి కబ్జాకు గురైన భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.30 కోట్ల  విలువ చేసే సుమారు 10 ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారు. 

శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామ పరిధిలో భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించిన రెవెన్యూ అధికారులు వెంచర్ లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటును తొలగించి ఎకరా భూమిని స్వాధీనం చేసుకున్నారు. 

వెంచర్ యజమానులు కరీం కుంట, గుల్లకుంట, మాసాని కుంటలకు,  వ్యవసాయ పొలాల్లోకి వెళ్లే దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం గల  రోడ్డును కబ్జా చేయగా  రెవెన్యూ ఆఫీసర్లు  కాంపౌండ్ ను తొలగించి నాలుగు ఎకరాల రోడ్డు  స్వాధీనం చేసుకున్నారు.

3 ఎకరాల 27 గుంటల  విస్తీర్ణం గల కరీం కుంటా శిఖంలో దాదాపు ఎకరా భూమిని వెంచర్ యజమానులు కబ్జా చేయగా ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి కబ్జాను నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వెంచర్ బాధ్యులైన వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

మూడు ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేయడానికి చెట్లను తొలగించి చదును చేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు కేసు నమోదు చేసి ఆ భూమిని  స్వాధీనం చేసుకున్నారు.
కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన జయలక్ష్మి నాలుగు ఎకరాల పట్టా భూమిని కబ్జా చేయడంతో ఆమె  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి జయలక్ష్మికి నాలుగు ఎకరాల భూమిని అప్పగించారు.