హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన మేడిగడ్డ టూర్ కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ తో పాటు బీజేపీ దూరంగా ఉంది. మేడిగడ్డ టూర్ రోజే బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించింది. నాగర్జున్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించిందని ఆరోపిస్తూ నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో సభ నిర్వహించింది. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో నల్గొండ బయల్దేరి వెళ్లారు. అయితే ఈ సభ ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ టూర్ కు వస్తామంటే తాము వేరే రోజు టూర్ నిర్వహిస్తామని మంత్రులు చెప్పారు. అయితే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మంగళవారం టూర్ కు వెళ్లేమందు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కోరారు. కేసీఆర్ కు బస్ జర్నీ ఇబ్బంది అనిపిస్తే బేగంపేట నుంచి ప్రభుత్వం తరఫున హెలికాప్టర్ రెడీగా ఉందని సీఎం చెప్పారు. అయినా బీఆర్ఎస్ నాయకులు వెళ్లలేదు. అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడుతూ.. త్వరలో తాము కూడా మేడిగడ్డ పర్యటనకు వెళ్తామని ప్రకటించారు.
ఎన్నికల్లో నష్టం జరుగుతుందని..
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ టూర్ కు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం టూర్ కు రావాలని అసెంబ్లీలో చెప్పినపుడు టూర్ కు వెళ్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియా చిట్ చాట్ లో తెలిపారు. సోమవారం మాత్రం మేము టూర్ కు వెళ్లడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అయితే టూర్ వల్ల లాభం లేదని, డ్యామేజ్ జరిగిన విషయం అందిరికీ తెలుసని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా డ్యామేజ్ రిపోర్ట్ ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నారు. డ్యామేజ్ జరిగిన తర్వాత మొదటగా తమ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజ్ ను సందర్శించి , విచారణ జరిపించి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారని, ఆ లేఖ వల్లే విచారణ జరిగిందని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంతో టూర్ కు వెళితే ఎన్నికల్లో నష్టం కలుగుతుందని, ఇద్దరు ఒకటే అని ప్రచారంను బీఆర్ఎస్ చేస్తుందనే నేపథ్యంలో కూడా టూర్ కు దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
