నేను రాజీనామా చేయ లేదు.. ఐదేళ్లు ఉంటా : హిమాచల్ సీఎం సుఖ్వీందర్

నేను రాజీనామా చేయ లేదు.. ఐదేళ్లు ఉంటా : హిమాచల్ సీఎం సుఖ్వీందర్
  • అధిష్టానం ఆదేశంతో తప్పుకున్నట్టు  ప్రచారం 
  • సంక్షోభ నివారణకు సిమ్లా కు డీకే, భూపేందర్
  • గంట గంటకూ మారుతున్న పరిణామాలు
  • బీజేపీకి ఆరుగురు హస్తం ఎమ్మెల్యేల మద్దతు!

ఎమ్మెల్యేల తిరుగుబాటు, క్రాస్ ఓటింగ్ తో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఖండించారు సీఎం. ఎలాంటి రాజీనామా చేయలేదని.. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారాయన. హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయని.. సీఎం మార్పు లేదంటూ.. సీఎం సుఖ్వీందర్ ఓ జాతీయ ఛానెల్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ అభ్యర్థి గెలవడంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో పార్టీ బలం 34కి పడిపోయింది. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాం ఠాకూర్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను కలిశారు. వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్‌ టెస్ట్‌ నిర్వహించాలని కోరారు. అనంతరం జైరాం ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందుకే గవర్నర్‌ను కలిసి ఫ్లోర్‌ టెస్ట్‌ పెట్టాల్సిందిగా కోరామని తెలిపారు. మరికొన్ని గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని అంటున్నారు. 

ALSO READ :- Tech Layoffs : పాపులర్ డేటింగ్ యాప్ Bumble నుంచి 350 మంది ఉద్యోగులు ఔట్..

కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిభ సింగ్ కుమారుడు, మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి.  ఈ క్రమంలో సీఎం సుఖ్వీందర్  రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలనే హిమాచల్ ప్రదేశ్ సీఎం ఖండించారు. 

హిమాచల్ ప్రదేశ్ లో ఏ పార్టీ బలం ఎంత..?

హిమాచల్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68 ఉండగా.. అందులో కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులున్నారు. బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి ఓటు వేశారు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ నెగ్గాలంటే.. కాంగ్రెస్ కు 35 మంది ఎమ్మెల్యేలు అవసరం. నిన్న కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో దాని 34 తగ్గింది. బీజేపీ పార్టీకి కూడా సరిగ్గా 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన బీజేపీకి మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం పెద్దపని కాదనే అభిప్రాయాలు వెల్లడువుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశం లేకపోలేదనే ఉహాగానాలు వస్తున్నాయి.