మేడిగడ్డ బ్యారేజీ ఓ​ చెత్త డిజైన్.. ఎంక్వైరీ చేస్తం, ఎవ్వరినీ వదలం : ఉత్తమ్​

మేడిగడ్డ బ్యారేజీ ఓ​ చెత్త డిజైన్.. ఎంక్వైరీ చేస్తం, ఎవ్వరినీ వదలం :  ఉత్తమ్​
  • వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలే: ఉత్తమ్​
  • డిజైన్, స్పెసిఫికేషన్, మెటీరియల్​ సర్కారే ఇచ్చిందని ఎల్అండ్​టీ అంటున్నది
  • ఇంజినీర్లనడిగితే.. డిజైన్​ ఒక్కరే చేశారని.. ఆయన కట్టమన్నట్టు కట్టినమంటున్నరు
  • బ్యారేజీ కుంగి 41 రోజులు గడిచినా.. గత సర్కారు సీరియస్​ ఇన్వెస్టిగేషన్​ చేయలేదు
  • లక్ష కోట్లు ఖర్చుపెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది లక్ష ఎకరాలా?
  • ఎంక్వైరీ చేస్తం, ఎవ్వరినీ వదలమని వార్నింగ్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : మేడిగడ్డ బ్యారేజ్​ ఓ చెత్త డిజైన్​అని, అది కుంగడం వెనుక గత సర్కారు క్రిమినల్‌‌‌‌ నెగ్లిజెన్స్‌‌‌‌ ఉందని రాష్ట్ర ఇరిగేషన్​మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఒక బ్యారేజ్‌‌‌‌ ఇలా కొలాప్స్‌‌‌‌ కావడం ఎక్కడా జరగలేదని ఆయన మండిపడ్డారు. ‘‘మేడిగడ్డ ఎందుకు కుంగిందని నిర్మాణ సంస్థను అడిగితే.. ‘సర్కారే డిజైన్​ ఇచ్చింది, సర్కారే స్పెసిఫికేషన్​ఇచ్చింది, సర్కారే మెటీరియల్​చెప్పింది’ అని బదులిచ్చింది. ఇదేందయా అని ఇంజనీర్లను అడిగితే.. ‘అప్పుడు డిజైన్​ మొత్తం ఒక వ్యక్తిదే కదా.. ఆయన కట్టమన్నరు మేము కట్టినమ’ని వాళ్లు అన్నరు”అని ఉత్తమ్​పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అక్టోబరు 21న మేడిగడ్డ కుంగితే పది రోజుల క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. నాటి సీఎం కేసీఆర్‌‌‌‌ ఈ ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. బ్యారేజీ ప్రమాదంపై ముందస్తు సంకేతాలు వచ్చినా కనీసం రెక్టిఫికేషన్‌‌‌‌ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 

5 ఫీట్ల లోపలికి పడిపోయింది..

ప్రాజెక్టుల్లో జరిగిన ప్రజాధన దుర్వినియోగం, బ్యారేజ్​ నష్టంపై ఎంక్వైరీ చేస్తామని, తప్పు చేసిన వారికి శిక్షపడుతుందని ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్న.. మేడిగడ్డ పూర్లీ డిజైన్‌‌‌‌..పూర్లీ బిల్ట్. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన బ్యారేజ్‌‌‌‌ కొలాప్స్‌‌‌‌ కావడం ఎక్కడ జరగలేదు. మేడిగడ్డ బ్యారేజ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ నంబర్‌‌‌‌ 7 ప్రత్యక్ష సాక్షిని అడిగితే పెద్ద శబ్దం వచ్చిందని చెప్పాడు. బ్యారేజ్​5 ఫీట్ల లోపలికి పడిపోయింది. గత 40 రోజుల్లో దీనిపై సీరియస్‌‌‌‌ ఇన్విస్టిగేషన్​ కూడా జరగలేదు. ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ నిపుణులు చెప్పిన ప్రకారం.. మేడిగడ్డ దగ్గర జియాలజిస్ట్ చెక్‌‌‌‌ చేయలేదు. డిజైన్‌‌‌‌ సరిగా చేయలేదు..అందుకే పియర్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ కొలాప్స్‌‌‌‌ అయింది.  బ్లాక్‌‌‌‌ నంబర్‌‌‌‌ 7ను లాంగ్విటీ గురించి ఏం చేయాలనే దానిపై  ఇన్వెస్టిగేషన్‌‌‌‌ జరుగుతోంది. ఇది గత సర్కారు పూర్తి వైఫల్యం’’ అని అన్నారు. అప్పటి మంత్రి హరీశ్​రావు ప్రాజెక్టు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, వారి మాటల్లోని అద్బుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇదీ.. అని మంత్రి ఉత్తమ్‌‌‌‌ ఎద్దేవా చేశారు. అన్నారం, సుందిళ్ల రెండిటీకి క్రాక్స్‌‌‌‌ వచ్చాయని, వాటికి రిపేర్‌‌‌‌ చేయాలంటే అక్కడున్న 2 టీఎంసీల నీటిని కూడా కిందకు వదలాల్సి ఉన్నదన్నారు. ‘‘తెలంగాణ ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం. గత ప్రభుత్వంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారో రికార్డులో ఏముందో తెలియదు. అలార్మింగ్‌‌‌‌ సిచ్యువేషన్‌‌‌‌ ఇది. గత ప్రభుత్వం అప్పులు తీసుకువచ్చి ఆస్తులు సృష్టించిందని అంటున్నది. మనపిల్లల్ని తాకట్టు పెట్టి హైకాస్ట్‌‌‌‌ లోన్స్‌‌‌‌ తీసుకువచ్చి కట్టింది ఇలా ఉన్నది’’ అని ఉత్తమ్​విమర్శించారు. 

కాగ్​ లెక్కల ప్రకారం కాళేశ్వరంతో 40 వేల ఎకరాలే సాగులోకి..

ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని గొప్పలు చెప్పుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం లక్ష ఎకరాలేనని,  కాగ్ రిపోర్ట్‌‌ ప్రకారం అయితే 40 వేల ఎకరాలేనని మంత్రు ఉత్తమ్​ గుర్తు చేశారు. ‘‘క్యాపిటల్‌‌ ఎక్స్‌‌పెండీచర్‌‌ అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్న గత సర్కారు అప్పుల పరిస్థితి ఇదీ. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు సున్నా.  సీతారామ ప్రాజెక్ట్‌‌ కు రూ.7500 కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు సున్న. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి మీరు కొత్త ఆయకట్టు తీసుకురాక పోతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినవాళ్లు కాదా’’ అని ఉత్తమ్​ప్రశ్నించారు.

కేటీఆర్‌‌, హరీశ్​రావు చెప్పినవి అవాస్తవాలు

సివిల్ సప్లయ్స్‌‌ పై బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్​రావులు ఆన్‌‌ రికార్డ్‌‌గా చెప్పిన విషయాలు అవాస్తవాలని మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ రూ.56 వేల కోట్ల అప్పు, రూ.11500 కోట్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నదని ఆయన తెలిపారు. గత పదేండ్లుగా రేషన్‌‌ బియ్యం సబ్సిడీ ఇవ్వనందుకు కార్పొరేషన్‌‌ అప్పులు 2014 నాటికి రూ.3361 కోట్లు ఉంటే, సబ్సిడీ ఇవ్వక రూ.56 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాకంతో ఏటా  కేవలం వడ్డీలకే రూ.3 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. రూ.22 వేల కోట్ల విలువైన ధాన్యం రైస్‌‌ మిల్లర్ల వద్ద ఎలాంటి పూచీకత్తు లేకుండా ఉందని మంత్రి పేర్కొన్నారు.  సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నష్టాల్లో ఉన్నా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు వారి రాష్ట్రాల్లో అవసరాల కోసం స్టాక్‌‌ను నెలకు 2.50 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలని కోరినా కేవలం పొలిటికల్‌‌ కారణాల వల్ల స్టాక్‌‌ ఉన్నా గత సర్కారు వారికి బియ్యం అమ్మలేదని మంత్రి ఉత్తమ్​ మండి పడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో డాక్యుమెంటేషన్‌‌ సరిగా చేయలేదని, కేంద్రం ఇవ్వాల్సిన వేల కోట్లు ఇంకా పెండింగ్‌‌లో ఉన్నాయని అన్నారు. గత సర్కారు సబ్సిడీ ఇవ్వలేదని, సెంట్రల్‌‌ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి తీసుకోలేదని తెలిపారు. అందుకే సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నదని వెల్లడించారు.