తెలంగాణ రాజ్యసభ రేసులో ఎవరు .. మూడ్రోజుల్లో ముగియనున్న నామినేషన్ల గడువు  

తెలంగాణ రాజ్యసభ రేసులో ఎవరు .. మూడ్రోజుల్లో ముగియనున్న నామినేషన్ల గడువు  
  • అభ్యర్థులను ఇంకా ఖరారు చేయని కాంగ్రెస్
  • అసెంబ్లీ సెషన్ తర్వాత ఎంపిక చేసే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్​లో తీవ్ర పోటీ నెలకొన్నది. అయితే మరో మూడ్రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనుండగా, అభ్యర్థులపై కాంగ్రెస్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో వద్దిరాజు రవిచంద్ర, జోగినిపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్​స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు సీట్లకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ నెల 8న నామినేషన్లు మొదలుకాగా, 15వ తేదీతో గడువు ముగియనుంది. నామినేషన్లకు మరో మూడు రోజులే గడువు ఉండడం, అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ ఆలస్యం చేస్తుండడంతో ఆశావహులు ఆందోళనలో ఉన్నారు. చివరి నిమిషం వరకు వెళ్తే తమ టికెట్ ఎక్కడ మిస్​అవుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్​సమావేశాలు నడుస్తుండడంతో ఆ తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

లిస్టులో మస్తు మంది.. 

అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్​కు రెండు, బీఆర్ఎస్​కు ఒక స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక సీటు జాతీయ నేతకు, మరో సీటు రాష్ట్ర నేతకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్​సభకు పోటీ చేయించాలని భావిస్తున్న కాంగ్రెస్​ రాష్ట్ర నాయకత్వం.. ఒకవేళ ఆమె రాజ్యసభ ద్వారా పార్లమెంట్​కు వెళ్లాలని భావిస్తే, రాష్ట్రం నుంచే నామినేట్​ చేయాలన్న యోచనలో ఉందన్న చర్చ నడుస్తున్నది. సోనియాతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్​చార్జ్ మాణిక్​రావ్ ​ఠాక్రే, ప్రస్తుత ఇన్​చార్జ్ దీపాదాస్​ మున్షీ, ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ ​పవన్ ​ఖేరా, సుప్రియా శ్రీనాటే, కన్నయ్య కుమార్  పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

మిగిలిన సీటు కోసం రాష్ట్ర నేతల నుంచి తీవ్ర పోటీ కనిపిస్తున్నది. ఖమ్మం లోక్​సభ టికెట్​ఆశిస్తున్న రేణుకా చౌదరి, వీహెచ్, జానారెడ్డి, వనపర్తి  టికెట్​ఆశించి భంగపడిన సీనియర్​ నేత చిన్నారెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, అద్దంకి దయాకర్, నాగర్​కర్నూల్​ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సంపత్​ కుమార్ ​వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని, టికెట్లు వదులుకున్న నేతల పేర్లను ప్రాధాన్య క్రమంలో పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తున్నది. కాగా, మూడో సీటును కూడా దక్కించుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. 

ఓటింగ్ ఎట్లుంటదంటే? 

మన రాష్ట్రం నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి.. అసెంబ్లీలో సంఖ్యా బలం పరంగా రెండు కాంగ్రెస్​కు, ఒకటి బీఆర్ఎస్​కు ఎన్నిక లేకుండానే దక్కడం ఖాయం. అయితే నాలుగో వ్యక్తి బరిలోకి వస్తే మాత్రం ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలను 4తో విభజించాలి. ఒక్కొక్కరికి సగటున 30 ఓట్లు పడాల్సి ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా నలుగురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. లేదనుకుంటే తనకు నచ్చిన వారికి ఒక్కరికే ఓటు వేసే హక్కు ఉంటుం ది.

ఈ క్రమంలో కాంగ్రెస్​కు రెండు సీట్లు పక్కాగా దక్కే అవకాశం ఉంది. మూడో స్థానం విషయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి క్రాస్​ ఓటింగ్​జరిగితే తప్ప, ఆ స్థానం దక్కే అవకాశం ఉండదు. బీజేపీ, ఎంఐఎం పోటీకి దూరంగా ఉంటే 15 స్థానాలను మైనస్​ చేసి 104 స్థానా లను నలుగురు అభ్యర్థులతో డివైడ్​ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కరికి 26 ఓట్లు పడాలి. ఆ రెండు పార్టీలు ఓటింగ్​కు దూరమైతే.. కాంగ్రెస్​కు రెండు స్థానాలతో పాటు మరో స్థానం దక్కే అవకాశం ఉంటుంది. మిత్రపక్షం సీపీఐతో కలిపి కాంగ్రెస్​కు 65 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు. రెండు స్థానాలకు కావాల్సిన 52 ఓట్లను తీసేస్తే.. ఇంకో 13 ఓట్లు ఉంటాయి. ఆ 13 ఓట్లకు తోడు ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరైనా క్రాస్​ఓటింగ్​ చేస్తే మూడో స్థాన కూడా కాంగ్రెస్​ ఖాతాలో పడే చాన్స్​ ఉంటుంది.