
- సెన్సస్ 2027కు ఏర్పాట్లు ప్రారంభం
- 2026 ఏప్రిల్– 2027 ఫిబ్రవరి మధ్య 2 ఫేజ్లలో జనగణన
- తొలిసారిగా డిజిటల్, క్యాస్ట్ సెన్సస్కూ ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సెన్సస్ 2027 నిర్వహణ కోసం ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ అధికారికంగా గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం.. ‘జనాభా లెక్కలు-2027’ను 2026, ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 మధ్య రెండు ఫేజ్ లలో నిర్వహించనున్నారు. ఫేజ్ 1లో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ షెడ్యూల్ చేపడతారు. ఫేజ్ 2లో పాపులేషన్ ఎన్యుమరేషన్ (జనాభా లెక్కింపు) నిర్వహిస్తారు. ఫస్ట్ ఫేజ్ కు ముందు నవంబర్ 10 నుంచి 30 వరకూ ప్రీటెస్ట్ చేపడతారు. ప్రీటెస్ట్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 10 నుంచి 30 వరకూ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ నిర్వహిస్తారు.
తొలిసారిగా దేశ పౌరులు తమ వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ గా అందించేందుకు కూడా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 1 నుంచి 7 మధ్య డిజిటల్ సెల్ఫ్ఎన్యుమరేషన్ కు అవకాశం కల్పిస్తారు. జనాభా లెక్కల ప్రక్రియలో ప్రీటెస్ట్ దశను చేపట్టేందుకు వీలుగా సెన్సస్ యాక్ట్, 1948, సెక్షన్ 17ఏలోని నిబంధనలను కేంద్రం పొడిగించింది.
2027లో పూర్తిస్థాయి జనాభా లెక్కల సేకరణకు ముందుగా తలెత్తే ఇబ్బందులను గుర్తించడం, పలు టెక్నాలజీలను పరీక్షించడం, అవసరమైతే కొన్ని విధానాలను సవరించుకోవడం కోసం ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రశ్నలు, డేటా సేకరణ, ట్రెయినింగ్, రవాణా, మొబైల్ యాప్, సాఫ్ట్ వేర్ వంటి వాటన్నింటినీ పరీక్షించి, ఏమైనా సమస్యలు ఉంటే సరిదిద్దనున్నారు.
తొలిసారి డిజిటల్, క్యాస్ట్ సెన్సస్..
దేశంలో డిజిటల్ సెన్సస్ నిర్వహించడం ఇదే తొలిసారి కానుంది. అలాగే జనాభా లెక్కల్లో కులాల సమాచారం సేకరించడం కూడా ఇదే మొదటిసారి అవుతుంది. ఫేజ్ 1లో హౌస్ లిస్టింగ్ లో భాగంగా ప్రతి కుటుంబానికి చెందిన ఇండ్ల కండీషన్, ఆస్తులు, సౌలతుల వివరాలు నమోదు చేస్తారు. ఫేజ్2లో జనాభా లెక్కింపులో భాగంగా ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, స్థితిగతులు, ఇతర వివరాలను ఎంట్రీ చేస్తారు.