- జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రి ఉత్తమ్ కుమార్
- గూడెం మహిపాల్‌ను బుజ్జగించే బాధ్యత ఓ సీనియర్ నేతకు
- మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్‌లకు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో కాంగ్రెస్ లో అసంతృప్తులను బుజ్జగించడంపై హైకమాండ్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల, పటాన్ చెరు నియోజకవర్గాల్లో నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయాచోట్ల పాత.. కొత్త నేతల మధ్య సమన్వయం కోసం మంత్రులు రంగంలోకి దిగారు.
జీవన్‌రెడ్డికి బుజ్జగింపులు..
గాంధీ భవన్ లో ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరును నిరసిస్తూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వాకౌట్‌చేశారు.
ఈ విభేదాలు కీలకమైన జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉండడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి జీవన్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగిరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పటాన్చెరులోనూ..
పటాన్ చెరు నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, నీలం మధుకు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్నడుమ ఆధిపత్య పోరు నడుస్తోంది. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని భావించిన గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని ఇటీవల కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం దుమారం రేపింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తనకు పైసా మందం లాభం జరగలేదని నిట్టూర్చారు.
ఈ ఎఫెక్ట్ మున్సిపల్‌ఎన్నికల్లో పడనుండడంతో పీసీసీ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. గూడెంను బుజ్జగించే బాధ్యతను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షునికి అప్పగించింది. పంచాయితీ ఎన్నికల్లో ఇలాంటి విభేదాల వల్లే సునాయసంగా గెలవాల్సిన పలు పంచాయతీలను కాంగ్రెస్ చేజార్చుకుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తప్పులు జరగకుండా, రెబల్స్ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పీసీసీకి చెందిన ఓ ముఖ్య నేత ‘వెలుగు’ తో పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఎక్కడ ఎలాంటి విభేదాలున్నా వెంటనే సమన్వయ సమావేశం ఏర్పాటుచేయాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్ లకు ఆదేశాలు వెళ్లాయని ఆయన తెలిపారు.
