తెలంగాణలో మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్​! ప్రతి నెలా రూ.3 వేలు

తెలంగాణలో మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్​! ప్రతి నెలా రూ.3 వేలు
  • నేడు చర్చించనున్న సీడబ్ల్యూసీ   
  • 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై హైకమాండ్​ దిశానిర్దేశం
  • కర్నాటకలోని ‘గృహలక్ష్మీ’ తరహాలో ఇక్కడ ‘మహాలక్ష్మి’ పథకం
  • మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామని ప్రకటించే చాన్స్

హైదరాబాద్, వెలుగు : సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా తొలిరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వ విధానాలపైనే విస్తృతంగా చర్చించిన కాంగ్రెస్.. రెండో రోజు తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఆదివారం అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, అధికారంలో లేని రాష్ట్రాల సీఎల్పీ నేతలతో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు రాష్ట్ర నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పర్యటనకు పంపుతున్న నేపథ్యంలో.. ఆయా చోట్ల అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై లీడర్లకు సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్​గాంధీ దిశానిర్దేశం చేస్తారని తెలిసింది. ముఖ్యంగా విజయభేరి సభలో సోనియా ప్రకటించనున్న ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారని సమాచారం.

అంతేగాకుండా మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపైనా చర్చించే చాన్స్ ఉంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా కర్నాటకలోని గృహలక్ష్మీ పథకం తరహాలో ఇక్కడ ‘మహాలక్ష్మీ’ పేరుతో అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. కర్నాటకలో మహిళలకు ప్రతి నెల రూ.2 వేలు ఇస్తుండగా, ఇక్కడ రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై ప్రముఖంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గ్యారంటీల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, అభయహస్తం (దళితులు, గిరిజనులకు రూ.12 లక్షల సాయం), చేయూత (రూ.4 వేల పింఛన్) ఉండనున్నట్టు తెలుస్తున్నది. మరో గ్యారంటీని ఓబీసీలకు సంబంధించి ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మీటింగ్ అయిపోంగనే సభకు..
 
రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలను ఉదయం 10:30 గంటలకు స్టార్ట్​ చేసి, మధ్యాహ్నం 3:30 గంటల కల్లా పూర్తి చేయాలని హైకమాండ్​ నిర్ణయించింది. ఆ వెంటనే అక్కడి నుంచి ర్యాలీగా ‘విజయభేరి’ సభ నిర్వహించనున్న తుక్కుగూడకు వెళ్తారు. సాయంత్రం 4:45 గంటలకు తాజ్​కృష్ణా హోటల్​ నుంచి బయల్దేరి, సాయంత్రం 6 గంటలకు తుక్కుగూడలో సభను ప్రారంభిస్తారు. 7:30 గంటల కల్లా పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్​అబ్జర్వర్లను వారికి అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్లేలా వారి కాన్వాయ్​ను జెండా ఊపి ప్రారంభిస్తారు. నేతలు ఆ రాత్రి ఆయా నియోజకవర్గాల్లోనే నిద్ర చేసి, 18న ఇంటింటికీ తిరిగి గ్యారంటీ కార్డులు, చార్జ్ షీట్ ను పంపిణీ చేయనున్నారు. 

Also Raed:  హైదరాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్​ హైలైట్స్ ఇవే..

పార్టీ నేతల అసంతృప్తి..
 
సీడబ్ల్యూసీ సమావేశాలపై పలువురు పార్టీ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. లోపలికి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో.. తమకు కనీసం పాసులు కూడా ఇవ్వలేదని కొందరు ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ కండువా కప్పుకున్న తుమ్మల నాగేశ్వర్​రావు వెంట వచ్చిన కార్యకర్తలు, అనుచరులనూ హోటల్​లోకి అనుమతించారని.. ముఖ్య నేతలమైన తమను మాత్రం పంపించకుండా అడ్డుకున్నారంటూ కొందరు వాపోయారు.

రాష్ట్ర సర్కార్ అవినీతిపై ప్రచారం..​ 

రాష్ట్ర సర్కార్ చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్​ హైకమాండ్​ దృష్టి పెట్టినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్​లో దానిపై చర్చించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన వ్యూహాలపై సోనియా, ఖర్గే దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. దాంతో పాటు నియోజకవర్గాలవారీగా విడుదల చేయాల్సిన మినీ చార్జ్​షీట్​పైనా చర్చ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటింటికీ గ్యారంటీ కార్డులను పంపిణీ చేసేలా నేతలకు ఆదేశాలు ఇస్తారని తెలుస్తున్నది. మరోవైపు తెలంగాణ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలతో చర్చించే చాన్స్ ఉంది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కొనేలా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకునేలా నేతలను సన్నద్ధం చేస్తారని సమాచారం.