
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా ఆ పార్టీ నేతలే దానిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు శశి థరూర్, మనీశ్ తివారీలను ప్రభుత్వం లోక్ సభలో చర్చకు దూరంగా ఉంచింది.
ఈ క్రమంలో మనీశ్ తివారీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో తాను భారత్ వైపే మాట్లాడతానని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచదేశాలకు వివరించడానికి వెళ్లిన అఖిలపక్ష బృందంలో శశి థరూర్, మనీశ్ తివారీ ఉన్నారు.
ఈ ఆపరేషన్ పై జరిగే చర్చలో తమను ఎందుకు దూరం పెట్టారనే దానిపై ఓ వార్తా సంస్థ ప్రచురించిన కథనాన్ని మనీశ్ తివారీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ అనే బాలీవుడ్ సినిమాకు చెందిన దేశభక్తి గీతంలోని కొన్ని వ్యాఖ్యలను జత చేశారు. ఒక భారతీయుడిగా తాను దేశ వైభవాన్నే కోరుకుంటా అనేది దాని అర్థమని తెలుస్తోంది.