బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఇండోర్​ అభ్యర్థి

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఇండోర్​ అభ్యర్థి

న్యూఢిల్లీ:  లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్ ఎంపీ సీటుకు నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ పోటీ నుంచి తప్పుకున్నారు. తన నామినేషన్‌‌ను విత్ డ్రా చేసుకొని బీజేపీలో జాయిన్ అయ్యారు. సోమవారం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలాతో కలిసి కాంతి బామ్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసుకు వెళ్లి తన నామినేషన్​ ఉపసంహరించుకున్నారు. అలాగే మరో ముగ్గురు ఇండిపెండెంట్​ అభ్యర్థులు కూడా నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ఇండోర్​లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ పోటీలో ఉన్నారు. దాదాపు ఇదే తరహాలో గుజరాత్‌‌లో సూరత్ సీటును బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్​ అవగా.. అతను ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లాడు. మిగతా ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.

బీజేపీ నేతలతో సెల్ఫీతో వెలుగులోకి...

కాంతి బామ్ బీజేపీ చేరేందుకు ఆ పార్టీ నేతలతో కలిసి తన కారులో వెళ్తున్న సెల్ఫీ ఫొటోను బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్​ వర్గియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం మోహన్‌‌ యాదవ్‌‌ నేతృత్వంలో కాంతి బామ్​కు బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నట్లు పోస్ట్‌‌లో పేర్కొన్నారు. దీంతో కాంతి బామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్న సంగతి బయటపడింది. మీడియా దీనిపై రిటర్నింగ్ ఆఫీసర్ అయిన కలెక్టర్ ఆశిష్ సింగ్​ను వివరణ కోరగా ‘‘కాంగ్రెస్ అభ్యర్థి బామ్‌‌తో సహా ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ప్రక్రియను వీడియో తీశాం” అని తెలిపారు. ఇండోర్ ఎంపీ సీటు పరిధిలోని ముగ్గురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరడంతో బామ్​కు కాంగ్రెస్ టికెట్​ ఇచ్చింది. ఇప్పుడు అతను కూడా పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్​ను షాక్​కు గురిచేసింది. అతనికి టికెట్​ ఇవ్వొద్దని.. నమ్మక ద్రోహం చేసి బీజేపీలో చేరుతారని హెచ్చరించినా హైకమాండ్​ పట్టించుకోలేదని లోకల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.