- ఎమ్మెల్యే బత్తుల ప్రమేయం లేకుండా అభ్యర్థుల ప్రకటన
- ఆగ్రహంతో తన కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయించిన ఎమ్మెల్యే
నల్గొండ, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడలో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయుల మధ్య వర్గపోరు నడుస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల పంపకాలలో తేడా రావడంతో ఎమ్మెల్యే తన ఫ్యామిలీ మెంబర్స్ తో నామినేషన్లు వేయించడంతో మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తంగా మారాయి.
మరోవైపు మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆయన భార్య నాగలక్ష్మి, కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి భార్య కవిత కూడా నామినేషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది.
త్రిముఖ పోరు..
మిర్యాలగూడ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ లో వర్గపోరు నడుస్తోంది. జానారెడ్డి తన సన్నిహితుడు శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీగా నియమించడంతో ఎమ్మెల్యే అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో మిర్యాలగూడలో శంకర్ నాయక్.. బత్తుల లక్ష్మారెడ్డి అనుచరుల మధ్య వర్గపోరు మొదలైంది. గత మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న తిరునగర్ భార్గవ్ బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్ లో చేరడంతో మిర్యాలగూడ రాజకీయం వేడెక్కింది.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని భార్గవ్ పట్టుబట్టడంతో ఎమ్మెల్యే వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రెండుసార్లు మిర్యాలగూడకు వచ్చిన ఎంపీ రఘువీర్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో ఇరువర్గాల నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలం కావడంతో ఎమ్మెల్యేకు చెప్పకుండా మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
దీంతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆగ్రహంతో తన సతీమణి మాధవి, ఇద్దరు కొడుకులు సాయిప్రసన్న, ఈశ్వర గణేశ్ కుమార్ తో నామినేషన్లు వేయించారు. మరోవైపు ఎమ్మెల్యేకు పోటీగా 48 వార్డులో భార్గవ్ సైతం ఆయన భార్య నాగలక్ష్మి, కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి భార్య కవితతో నామినేషన్లు వేయించారు. వీరి వ్యవహారం కాస్త అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఎంపీ రఘువీర్ రెడ్డి మిర్యాలగూడలో జరుగుతున్న వర్గపోరును ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీని వీడే యోచనలో భార్గవ్..
కాంగ్రెస్‌లో జరుగుతున్న అన్యాయం గురించి చర్చించేందుకు తిరునగరు భార్గవ్ శనివారం మిర్యాలగూడలో తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో చర్చించి పార్టీ మరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరుల వైఖరితో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న లీడర్లను పక్కన పెట్టారని భార్గవ్ ఆరోపించారు. ఇప్పటికే రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించిన ఆయన.. బీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
