షెడ్యూల్​కు ముందు రోజుకో జీవో ఇస్తున్నరు.. ఈసీ అధికారుల భేటీ

షెడ్యూల్​కు ముందు రోజుకో జీవో ఇస్తున్నరు.. ఈసీ అధికారుల భేటీ
  • ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్నరు
  • ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదుఎన్నికల ఖర్చు పెంచండి: బీఆర్ఎస్ 
  • బోగస్ ఓటర్లను తొలగించండి: బీజేపీ రాజకీయ పార్టీలతో 

హైదరాబాద్, వెలుగు: వారం, పది రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందని ప్రభుత్వం రోజుకో కొత్త జీవో ఇస్తోందని కాంగ్రెస్ మండిపడింది. పథకాల పేరుతో ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఫైర్ అయింది. ఇలా ప్రభుత్వ సొమ్ముతో ఓట్ల కొనుగోలు ప్రక్రియను అడ్డుకోవాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ను కోరింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈసీ టీమ్ మంగళవారం హైదరాబాద్ లో వివిధ పార్టీల నాయకులతో సమావేశమైంది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ప్రచారంపై అభిప్రాయాలు, సమస్యలు, ఫిర్యాదులు అడిగి తెలుసుకుంది. 

ఈసీతో భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్​బాబు, ఫిరోజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొంతమంది అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. ఆ అధికారుల పేర్లను ఈసీకి అందజేశామని తెలిపారు. ‘‘బోగస్ ఓటర్ల గురించి ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఓటర్ల జాబితాపై మేం చేసిన ఫిర్యాదులపై స్పష్టత వచ్చే వరకు తుది జాబితాను ప్రకటించవద్దని కోరాం” అని చెప్పారు. గతంలో ఉప ఎన్నికల్లో పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలించిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ‘‘నాంపల్లి నియోజకవర్గంలో చనిపోయినోళ్ల ఓట్లు 10 వేలు ఉన్నాయి. నేను లక్ష ఫిర్యాదులు చేస్తే, 30 వేల వరకు పరిష్కారమయ్యాయి” అని ఫిరోజ్​ఖాన్ తెలిపారు. 

ఆ గుర్తులపై ఫిర్యాదు చేశాం: బీఆర్ఎస్ 

లీడర్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఈసీని కోరామని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ మీడియాకు తెలిపారు. ఎన్నికల ఖర్చును ఇప్పుడున్న దానికంటే రూ.20 లక్షలు పెంచాలని కోరామని చెప్పారు. ‘‘ఎన్నికల గుర్తుల విషయంలో మాకున్న అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఆటో, ట్రక్కు, రోడ్డు రోలర్‌‌ గుర్తుల వల్ల మా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరించాం.

 దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరాం” అని వెల్లడించారు. ఎన్నికల నియమ నిబంధనలు తెలుగులో కూడా అనువదించాలని కోరామన్నారు. ‘‘కరోనా తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కేసీఆర్​ను మోదీనే వద్దు అన్నారు. కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు, మోదీ పర్యటనకు ఏం సంబంధం” అని ప్రశ్నించారు.

ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానించాలి: ఆప్ 

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, ఆధార్‌‌ కార్డును ఓటర్‌‌ ఐడీతో అనుసంధానించాలని ఈసీని కోరినట్టు ఆమ్‌‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా నిఘా పెట్టాలని కోరినట్టు బీఎస్పీ నేత విజయార్య చెప్పారు. పోలింగ్​కు మూడ్రోజుల ముందు వరకు కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు సీపీఎం నేత నర్సింహా రావు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని, ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కాగా, ఈసీతో టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, లీగల్ సెల్ అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్‌‌ తదితరులు సమావేశమయ్యారు.
    
కేంద్ర బలగాలను రప్పించాలి: బీజేపీ 

అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపాలని, ఎక్కువ మంది పరిశీలకులను నియమించాలని ఈసీని కోరామని బీజేపీ నేత మర్రి శశిధర్​రెడ్డి తెలిపారు. ప్రధానంగా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేయిస్తోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. బోగస్ ఓటర్లను తొలగించాలని కోరాం. 

ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం” అని పేర్కొన్నారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నిక టైమ్ లో కేంద్ర బలగాలు రావడం వల్లే ఎలక్షన్ సజావుగా జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక టైమ్ లో కేంద్ర బలగాలు రాలేదు కాబట్టే డబ్బులు ఏరులై పారాయి. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇతర రాష్ట్రాల అధికారులకు ఇక్కడ ఎన్నికల డ్యూటీ వేయాలని కోరాం” అని తెలిపారు.