
హైదరాబాద్, వెలుగు: గత తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ డైరెక్షన్‌లో రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
కేవలం ఒక నెలలోనే రేవంత్ రెడ్డి ఆరుసార్లు ఢిల్లీకి వెళ్లడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఒక్క నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల అప్పు కోసం పాకులాడిందంటే.. బీఆర్ఎస్ సర్కార్ మాదిరే కాంగ్రెస్ కూడా అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన, వనరులను అభివృద్ధి చేసుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమేనని ఆరోపించారు.