
మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు..రాష్ట్రంలోని కేడీకి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ కారణమన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ డెవలప్ అయితే..తెలంగాణ వచ్చాక కేసీఆర్ దందాలు చేసి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. చెప్పుకోవడానికి చరిత్ర లేనోళ్లు... చేయడానికి చరిత్ర లేనోళ్లు..ఇవాళ మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా ఓడినా పోయేదేమి లేదని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్లో ఓడితే ఏమైందన్నారు. అటు దుబ్బాక, హుజురాబాద్లో గెలిచిన బీజేపీ ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏండ్లకు పైగా చరిత్ర ఉందన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి..ఇక్కడ ప్రజల గోసను తీర్చింది కాంగ్రెస్ అని చెప్పారు. మూడు తరాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ వారసులం అని..మునుగోడులో కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
బీజేపీ, టీఆర్ఎస్పై చార్జ్ షీట్..
టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ చార్జ్ షీట్ విడుదల చేసింది. కేసీఆర్, మోడీ మీద కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి చార్జీషీట్ను విడుదల చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని..వాటిని కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోడు భూములు, రైతుల ఇబ్బందులను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక రకమైన పరిహారం, మునుగోడు నియోజకవర్గ నిర్వాసితులకు మరో రకమైన పరిహారం ఇచ్చారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించకుండా బీజేపీ, టీఆర్ఎస్లు మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తోడేళ్ల మంద, మిడతల దండు లెక్క మునుగోడు నియోజకవర్గం మీద బీజేపీ, టీఆర్ఎస్లు పడుతున్నాయని..రెండు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సెప్టెంబర్ 17ను ఎందుకు నిర్వహించడం లేదు..?
ఆగస్టు 15కు ఎంత ప్రాముఖ్యత ఉందో..తెలంగాణాలో సెప్టెంబర్ 17కు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించలేదని విమర్శించిన కేసీఆర్..తెలంగాణ వచ్చాక..8 ఏండ్లలో సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ల కమీషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని.. కేసిఆర్ క్యాబినెట్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నేండ్లు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి ఏడాది పాటు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
97వేల ఓట్లను 22వేల కోట్లకు అమ్ముకున్నడు..
కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎన్నో పదవులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందని..ఓడిపోతే ఎమ్మెల్సీగా గెలిపించిందన్నారు. ఎమ్మెల్సీగా ఉండగానే..ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు వేసిన 97 వేల ఓట్లను మోడీకి 22 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నాడని ఆరోపించారు. రాజీనామా చేస్తే నిధులు వస్తాయని రాజగోపాల్ రెడ్డి అన్నారని..రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఎన్నిగ్రామాల్లో రోడ్లేశారని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ అయిందా అని అడిగారు. రాజీనామాతో రాజగోపాల్ రెడ్డి మాత్రమే లాభపడ్డారని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో నేతల కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. మునుగోడులో నేతల అమ్మకాలు తప్ప అభివృద్ధి శూన్యమని చెప్పారు. పార్టీ మారిన నేతలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ గెలుపు ఖాయం...
2018లో కాంగ్రెస్ కు 97వేల ఓట్లు వచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పారు. మన ఓట్లు మనకే పడేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రతీ రోజూ రెండు గంటలు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలు, బస్తీల్లో తిరగాలని కోరారు. సమస్యలపై ప్రజలకు వివరించాలని..కాంగ్రెస్ వస్తే లాభమేందో చెప్పాలన్నారు. ప్రజల సమస్యలపై కొట్లాడాలని..చిత్తశుద్ధితో పనిచేస్తే నూటికి నూరు శాతం కాంగ్రెస్ 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టు కార్యకర్తలు కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. నాయకులు ఎటు పోయినా..ఈ ప్రాంత చరిత్ర తెలిసిన కమ్యూనిస్టు కార్యకర్తలు ఆలోచించాలన్నారు.