పరిగిలో కాంగ్రెస్ పాదయాత్ర.. ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ వెంట నడిచిన కాంగ్రెస్ శ్రేణులు

పరిగిలో కాంగ్రెస్ పాదయాత్ర.. ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ వెంట నడిచిన కాంగ్రెస్ శ్రేణులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం (జులై 31) పరిగిలో పాదయాత్ర ప్రారంభించారు. మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సాయంత్రం రంగారెడ్డి జిల్లా పరిగిలో పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రకు తరలివచ్చారు. శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ ముందుకు సాగారు. పాదయాత్ర పూర్తైన తర్వాత రాత్రి పల్లె నిద్ర చేయనున్నారు. శుక్రవారం (ఆగస్టు 01) ఉదయం శ్రమదానం చేసిన అనంతరం మధ్యాహ్నం పార్టీ నేతలతో భేటీ అవుతారు. అదేరోజు మెదక్ జిల్లా అందోల్ లో సాయంత్రం పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం అక్కడే శ్రమదానం చేసిన తర్వాత.. ఆగస్టు 2న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో, 3న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్​లో, 4న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పాదయాత్ర చేపట్టనున్నారు.

జులై 31 గురువారం నుంచి ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర ఉంటుంది. ఆగస్టు 4న ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌లో సమావేశం ఉంటుంది. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కార్యక్రమాలు ముగిశాక రెండో విడతగా పాదయాత్ర, శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగుతాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు.