
హైదరాబాద్: రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ కోఆర్డినేటర్ అద్దంకి దయాకర్ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందిరా పార్కు వద్ద మాలమహానాడు చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దీంతో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద మాల మహానాడు నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోగా.. మాలమహానాడు నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్ ప్రతి పక్ష పార్టీలు, ప్రజా సంఘాల గొంతునొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన దీక్షకు ఎందు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారన్నారు. తమ దీక్షను అడ్డుకోవడం ద్వారా కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్నారు. కేసీఆర్ వరి దీక్ష చేస్తే రాని సమస్యలు తాము చేస్తే వస్తాయా అని ప్రశ్నించారు. ఏప్రిల్ 9న జరిగే రాజ్యాంగ ఘర్జనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.