రికార్డ్ బ్రేక్.. రెండోసారి యూపీ సీఎంగా యోగి ప్రమాణం

రికార్డ్ బ్రేక్.. రెండోసారి యూపీ సీఎంగా యోగి ప్రమాణం

లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో కొత్త సర్కారు కొలువుదీరింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ ఆనందీ బెన్ యోగితో ప్రమాణ స్వీకారం చేయించారు.  యూపీలో వరుసగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన యోగి 37ఏళ్ల రికార్డు బ్రేక్ చేశారు. ఆయనతో పాటు 52 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఏకానా క్రికెట్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు. 

యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంల సంప్రదాయాన్ని కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో కేశవ్ ప్రసాద్ ఓటమి పాలైనప్పటికీ ఆయనకు మరోసారి అవకాశమిచ్చారు. ఇక గత ప్రభుత్వంలో డిప్యూటీగా ఉన్న దినేశ్ శర్మ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ స్థానాన్ని బ్రిజేష్ పాఠక్తో భర్తీ చేశారు. 

యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 255 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికల్లో ఆ పార్టీకి 41.29శాతం ఓట్ షేర్ వచ్చింది.