
- మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ ఆరోపణల కేసులో సుప్రీంను కోరిన ఆత్రం సుగుణ
- సమయం ఇచ్చిన కోర్టు.. విచారణ ఈ నెల 23కు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: మూసీ ప్రక్షాళనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన కౌంటర్ పై రిజాయిండర్ దాఖలు చేసేందుకు వారం గడువు ఇవ్వాలని పిటిషనర్ ఆత్రం సుగుణ తరఫు అడ్వకేట్ సుప్రీంకోర్టును కోరారు. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.25 వేల కోట్లను రేవంత్ సర్కార్ దారి మళ్లించిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ పార్టీ నేత ఆత్రం సుగుణ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో గతేడాది సెప్టెంబర్ 30న కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో తనపై అక్రమ కేసును బనాయించారని, ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ ఎఫ్ ఐఆర్ ను కొట్టివేస్టూ ఈ ఏడాది ఏప్రిల్ 21న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చూస్తూ ఆత్రం సుగుణ మే 19న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
ఆత్రం సుగుణ అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాది కేటీఆర్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారని, దీనిపై రిజాయిండర్ వేసేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని కోరారు. మరోవైపు ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు ఏఓఆర్ స్పందిస్తూ.. ఈ కేసులో తమ న్యాయవాదిని మార్చుతున్నట్లు కోర్టుకు తెలిపారు. అందువల్ల గత నోటీసులకు కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరువురి అభ్యర్థనలను విన్న బెంచ్.. కౌంటర్ దాఖలుకు, రిజాయిండర్కు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.