స్కిల్ డెవలప్‌‌మెంట్ పేరిట కవిత అక్రమాలు: కాంగ్రెస్ నేత బక్క జడ్సన్​

స్కిల్ డెవలప్‌‌మెంట్ పేరిట కవిత అక్రమాలు: కాంగ్రెస్ నేత బక్క జడ్సన్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్‌‌మెంట్ పేరుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. శిక్షణ ఇవ్వకుండానే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ నేతలు ఉజ్మా షకీర్ తదితరులతో కలిసి గాంధీ భవన్​ ముందు ఆయన ధర్నా చేశారు. 2014లో కేంద్రం స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్యక్రమాలను మొదలుపెట్టగా, కవిత, ఆమె భర్త డైరెక్టర్లుగా ఉన్న భారత్ జాగృతి ఫౌండేషన్ స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని చెప్పారు.

 రాష్ట్రవ్యాప్తంగా ఐదు స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారని, కేవలం ఫొటో షూట్లతోనే సరిపెట్టి రూ.కోట్లు దోచుకున్నారని జడ్సన్ ఆరోపించారు. వాటిలో శిక్షణ పొందిన వారి వివరాలు ఇప్పటికీ అందుబాటులో లేవని చెప్పారు. స్కిల్ డెవలప్‌‌మెంట్ వెబ్‌‌సైట్ కూడా కనిపించడం లేదన్నారు. కవిత చేసిన స్కామ్.. ఏపీలో చంద్రబాబు సీమెన్స్ కంపెనీతో కలిసి చేసిన స్కామ్ కంటే పెద్దదన్నారు. కాబట్టి కవిత తెలంగాణ జాగృతి సంస్థ కార్యకలాపాలన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.