మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుపై కాంగ్రెస్ లీడర్ల ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుపై కాంగ్రెస్ లీడర్ల ఫిర్యాదు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావుపై కాంగ్రెస్ లీడర్లు ఆదివారం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. శనివారం గణపతి నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని ముఖరం చౌరస్తాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై దివాకర్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సభలో దివాకర్​రావు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి కానీ.. శివాజీ పేరు చెప్పి రౌడీయిజం, గుండాయిజం చేస్తామంటే సహించేది లేదని అన్నారు. 

దీంతో వేదికపై ఉన్న కాంగ్రెస్ లీడర్లు తూముల నరేశ్, పూదరి తిరుపతి ఆయన చేతుల్లో నుంచి మైకు లాక్కున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ ముదురుతుండడంతో హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది. దివాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ తూముల నరేశ్, పూదరి తిరుపతి, చిట్ల సత్యనారాయణ తదితరులు ఆదివారం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పదవి కోల్పోయిన ఫ్రస్టేషన్​లో దివాకర్ రావు మతితప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. దివాకర్ రావు తీరుతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.