
సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నామని సీఎం కేసీఆర్ పెద్దపెద్ద మాటలు చెప్పడం తప్ప ఎక్కడా ప్రాజెక్ట్‌లు ఎందుకు పూర్తికావడం లేదని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎల్నీ మాజీ నేత జానారెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ అసమర్థత వల్లే గిరిజనులకు ఆరు నుంచి పది శాతానికి పెరగాల్సిన రిజర్వేషన్లు పెరగలేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ జేబులు నింపుకోడానికే అన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే నిరుద్యోగభృతి ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేసి దేవరకొండ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అక్టోబర్‌లో హుజుర్ నగర్ శాసనసభ ఎన్నికలు ఉండే అవకాశముందన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందిపెడితే తీవ్ర ప్రతిఘటనలుంటయ్, వడ్డీతో సహా బదులిస్తామని పోలీసులను హెచ్చరించారు. గత ఐదేండ్లలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిదని రాష్ట్రంలో బలపడుతుందన్నారు. టీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు హింసించడం తగదని జానారెడ్డి అన్నారు. డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేస్తామని ఐదేండ్లు గడిచినా అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు.