
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss )కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. స్టార్ మా , డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే తెలుగు బిగ్ బాస్ షో 9వ సీజన్ ( Bigg Boss Telugu Season 9 ) త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి షోకు సంబంధించిన థీమ్ 'అగ్నిపరీక్ష' అని ప్రకటించారు. ఈ సీజన్‌లో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే, కేవలం సెలబ్రిటీలతో కాకుండా సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రోమో విడుదల కాగా, హోస్ట్ నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'..
బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారిగా, హౌస్‌లోకి వెళ్లాలనుకునే సామాన్య ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన ఎంపిక ప్రక్రియను ఏర్పాటు చేశారు. వేలాది దరఖాస్తుల నుండి 40 మందిని మొదట ఎంపిక చేశారు. ఈ 40 మంది అభ్యర్థులకు నిజమైన సవాలు ఎదురుకాబోతోంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడానికి వీరు ఒక కఠినమైన 'అగ్నిపరీక్ష'ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో విజయం సాధించిన వారు మాత్రమే బిగ్ బాస్ 9వ సీజన్‌లో పాల్గొనే అవకాశం పొందుతారు.
దీనికి సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వహకులు. దీనిలో వేలాది మంది నుంచి వచ్చిన దరఖాస్తుల నుంచి 40 మందిని ఎంపిక చేశాం. ఇప్పుడు మొదలవుతోంది అసలైన పరీక్ష.. అగ్నీ పరీక్ష. దానిని దాటుకోని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ఎవరు వెళ్తారో చూద్దాం. ఈసారి 'చదరంగం కాదు.. రణరంగమే' అంటూ అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) ప్రకటించడం ఈ షోపై మరింత ఆసక్తిని పెంచింది. అయితే, ఈ అగ్నిపరీక్షకు సంబంధించిన టాస్క్‌లు, ఎపిసోడ్‌లు కేవలం డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో మాత్రమే ప్రసారం కానున్నాయి. అంటే, ఓటీటీ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ఈ ప్రత్యేకమైన పోటీని చూడగలరు. ఇది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
నాగార్జున మరోసారి హోస్ట్‌గా
బిగ్ బాస్ తెలుగు షోకు నాగార్జున ఏడవసారి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఆయన హోస్టింగ్‌పై వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ, ఈ విషయాన్ని నిర్ధారించారు. తనదైన శైలిలో నాగార్జున, "ఇది చదరంగం కాదు, రణరంగం" అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సీజన్ యొక్క తీవ్రతను తెలియజేశారు . ఈసారి ఆట కేవలం వ్యూహాలకే పరిమితం కాకుండా, కఠినమైన శారీరక, మానసిక పరీక్షలతో కూడుకుని ఉంటుందని స్పష్టం చేశారు.
అంచనాలు, కంటెస్టెంట్స్ వివరాలు
బిగ్ బాస్ 9వ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో టీవీ నటులు తేజస్విని గౌడ, కల్పిక గణేష్, నవ్య స్వామి, రితు చౌదరి, అలాగే ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ, అలేఖ్య చిట్టి, ఇమ్మానుయేల్, స్వామి, జ్యోతి రాయ్, ముఖేష్ గౌడ, సాయి కిరణ్ , హరిక, రేఖా బోజ్, ఏక్ నాథ్ వంటి వారు ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. ఈసారి సామాన్యుల కేటగిరీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | War 2 : అప్పట్లో అమితాబ్, రజినీ.. ఇప్పుడు హృతిక్, ఎన్టీఆర్...
మొత్తానికి, 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' థీమ్, సామాన్యులకు అవకాశం కల్పించడం వంటి అంశాలు ఈ సీజన్‌పై అంచనాలను భారీగా పెంచాయి. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి నాటకీయతలు, ఆసక్తికరమైన మలుపులు ఉంటాయో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు మరి..