
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan ), టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కలిసి నటించిన చిత్రం 'వార్ 2' ( War 2 ). భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆగ్ర హీరోల కలయిక, ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ), రజనీకాంత్ ( Rajinikanth ) కలిసి నటించిన 'అంధా కానూన్' ( Andhaa Kaanoon ) మూవీ రోజులను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా 'వార్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అంధా కానూన్' - ఒకప్పటి సంచలనం
1983లో 'అంధా కానూన్' సినిమా విడుదలైనప్పుడు సినీ అభిమానులు పండుగ చేసుకున్నారు. ఉత్తరాదిలో 'అమితాబ్ ఆఫ్ ది నార్త్' గా పేరుపొందిన అమితాబ్ బచ్చన్, దక్షిణాదిలో 'అమితాబ్ ఆఫ్ ది సౌత్' గా అభిమానులు పిలుచుకునే రజనీకాంత్ ఒకే తెరపై కనిపించడం ఒక అపూర్వ ఘట్టం. ఈ సినిమా పోస్టర్లు అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టి. రామా రావు దర్శకత్వంలో, పూర్ణచంద్ర రావు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. హేమ మాలిని, రీనా రాయ్, ప్రేమ్ చోప్రా వంటి అగ్ర నటులు ఇందులో నటించారు.
'వార్ 2' - కొత్త శకానికి నాంది కాబోతుందా?
అదే స్ఫూర్తితో ఇప్పుడు 'వార్ 2' సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ , అశుతోష్ రానా కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఒకప్పుడు 'అంధా కానూన్', ఆ తర్వాత అమితాబ్, రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించిన 'గిరఫ్తార్' వంటి సినిమాలు సాధించిన విజయాన్ని 'వార్ 2' కూడా సాధిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుందా?
దక్షిణ భారతదేశంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్, హిందీలో హృతిక్ రోషన్ కుఉన్న క్రేజ్ ఈ సినిమా విజయాన్ని ఖాయం చేస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరిద్దరి కలయికతో వస్తున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'కల్కి 2898 AD'లో అమితాబ్ బచ్చన్, రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటించారు. అది బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయం తర్వాత, ఇప్పుడు మరో అద్భుతమైన సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
►ALSO READ | Prabhas: మరోసారి వాయిదా పడిన 'రాజా సాబ్' రిలీజ్? సంక్రాంతి బరిలో ప్రభాస్!
ఈ మూవీలో హృతిక్ రోషన్ ఏజెంట్ కబీర్‌గా తన పాత్రను తిరిగి పోషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమవుతూ విలన్‌గా అడుగుపెడుతున్నారు. ఈ టీజర్‌లో కత్తుల పోరాటాలు, కార్ ఛేజ్‌లు, హ్యాండ్-టు-హ్యాండ్ పోరాటాలతో కూడిన సీక్వెన్సులు ఉన్నాయి. హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ 'వార్ 2' ను ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్. ఈ సినిమా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతుంది. మరి 'వార్ 2' సినిమా ఈ వారసత్వాన్ని కొనసాగించి, కొత్తతరం పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌లకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందో లేదో చూడాలంటే ఆగస్టు 14 వరకు ఎదురుచూడాల్సిందే మరి.