ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ సత్తా చూపిస్తాం

ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ సత్తా చూపిస్తాం

యాదాద్రి భువనగిరి జిల్లా:  కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీని, కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి ఇబ్బంది పెట్టారని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుంభం.. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో కి వెళ్తానని మీటింగ్ పెడితే..కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకించారన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. మునుగోడు గడ్డ ముమ్మాటికీ కాంగ్రెస్ అడ్డే అన్నారు. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే సమావేశానికి చౌటుప్పల్, నారాయణపురం మండల కాంగ్రెస్ అధ్యక్షులు దూరంగా ఉన్నారని కార్యకర్తలు కుంభం అనిల్ దృష్టికి తీసుకెళ్లగా..చౌటుప్పల్ ,నారాయణపురం మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అన్ని వింగ్ ల కమిటీలను రద్దు చేస్తున్నట్టు అనిల్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం చండూరులో పీసీసీ కమిటీ  సభ్యులతో భారీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు.