బీజేపీ కి మా నాయకులే దిక్కా..? : మల్లు రవి

బీజేపీ కి మా నాయకులే దిక్కా..? : మల్లు రవి

బీజేపీ కి ఇతర పార్టీల నాయకుల మీద ఉన్న శ్రద్ధ .. ప్రజా సమస్యలపై లేదని కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి అన్నారు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున బీజేపీ లోకి వస్తున్నారని బీజేపీ నాయకులు  గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ కి నాయకులు లేరా,  మా నాయకులు వస్తేనే దిక్కు ఉన్నట్టా.? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ కి దిక్కు లేదని ఆయన అన్నారు.  ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారని, ఎన్నికలకు ఇంకా నాలుగేండ్ల సమయముండగా ఎలా దించుతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్  12 మంది ఎమ్మెల్యే లు టీఆర్ఎస్ లో చేరితే తప్పు అని చెప్పిన బీజేపీ…. ఏపీ లో నలుగురు ఎంపీ లను ఎలా చేర్చుకుందని రవి ప్రశ్నించారు. బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుందని, ఆ పార్టీ చెప్పేది ఒకటి చేసేది మరోకటని ఆయన అన్నారు.

ఒక్క ప్రజా సమస్యపై కూడా ఉద్యమం చేయని బీజేపీ  టీఆర్ఎస్ కి ఎప్పటికి అల్టర్ నేటివ్  కాదని రవి అన్నారు. తామే టీఆర్ఎస్ కు  ప్రత్యామ్నాయం అవుతామని, తమకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో మంచి ఫలితాలు వచ్చాయని రవి ఈ సందర్భంగా అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని అన్నారు.

అటవీ అధికారులపై నాయకుల దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించిన మల్లు రవి.. దాడిని ముఖ్య సమస్య గా చూపిస్తున్నారన్నారు. గిరిజనుల  సమస్యల పరిష్కారం చేసేందుకు పోడు భూముల చట్టాన్ని అమలు చేయాలన్నారు. అధికారుల మీద దాడులు జరగకుండా చూడాలన్నారు. పోడు భూముల గురించి 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వం సాగు చేసుకునే వారికి పట్టాలు ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చిందని మల్లు గుర్తు చేశారు. ఇప్పుడున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల నుంచి వారిని బయటకి పంపిస్తున్నారని ఆయన అన్నారు.