
రాష్ట్రానికి పెద్ద దిక్కు, తండ్రి లాంటి వాడైన కేసీఆర్.. ఒక్క తన స్వంత గ్రామానికే నిధులు ఇస్తే మిగతా గ్రామాల పరిస్థితి ఏమిటని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రశ్నించారు. స్వంత గ్రామంలో ఇంటికి పది లక్షల చొప్పున లబ్ది చేకూరేలా కేసీఆర్ పథకాలు చేశారని, కేవలం ఒక్క గ్రామానికే 200 కోట్ల రూపాయలు కేటాయించారని రవి విమర్శించారు. తాను పుట్టి పెరిగిన గ్రామంపైన మమకారం ఉండడంలో తప్పు లేదని, అయితే తెలంగాణలోని మిగతా గ్రామాలను కూడా కేసిఆర్ పట్టించుకోవాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి రెండు కోట్ల రూపాయల చొప్పున ఇవ్వడం వల్ల ప్రతి గ్రామంలో కనీస సౌకర్యాలు పూర్తిగా ఏర్పాటు చేయవచ్చునని ఆయన అన్నారు. కేవలం ఒక్క గ్రామానికి నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటే వేలాది గ్రామాలు నష్టపోతాయని మల్లు రవి అన్నారు.