ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. ర‌క్ష‌ణ క‌ల్పించండి

ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. ర‌క్ష‌ణ క‌ల్పించండి

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ కు పొన్నం ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నార‌ని , సరైన వైద్య పరీక్షలు చేయకపోవడం వలన ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ప్రమాదం వాటిల్లుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న‌ద‌ని త‌న ఫిర్యాదు లో తెలిపారు.

ఆదివారం ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరైన ట్రీట్మెంట్ అందక ఇద్దరు కరోనా పేషెంట్ లు మృతి చెందిన‌ట్టు పొన్నం తెలిపారు. మృతి చెందిన వారిలో ఒక‌రు హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యంతో ఆక్సిజన్ అందక చ‌నిపోయాడ‌ని అన్నారు. ఆక్సీజ‌న్ అంద‌క‌నే తాను చనిపోతున్నట్టు ఆ వ్య‌క్తి ఒక వీడియో ద్వారా వారి కుటుంబీకులకు తెలియజేశాడని చెప్పారు.

మరో సంఘ‌ట‌న‌లో నారాయణఖేడ్ మండలం, నిజాంపేట గ్రామానికి చెందిన 8 నెలల బాలుడికి క‌రోనా సోక‌డంతో గాంధీ హాస్పిటల్ లో చేర్చార‌ని, వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైనందున ఆ బాలుడు మరణించాడని తెలిపారు . వీటి పైన విచారణ జరిపించి, దోషుల పైన చర్యలు తీసుకోవాలని పొన్నం కోరారు.

రాష్ట్రంలో జరిగిన ఈ రెండు సంఘటనలను త‌మ దృష్టికి తీసుకువస్తున్నామ‌ని, ఈ సంఘటనకు సంబంధించి టీవీ ఛానల్లో ప్రసారమైన లింకును జత చేస్తున్నానని రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ కు తెలియ‌జేశారు. క‌రోనా నేప‌థ్యంలో మానవ ప్రాణాలకు రక్షణ కల్పించి వారు జీవించేందుకు సరైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పొన్నం కోరారు.