
కరీంనగర్ టౌన్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలొస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. శుక్రవారం కరీంనగర్ డీసీసీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోడు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎఫ్ఆర్ఓది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విషయంలో చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత పేరు వస్తే.. రాజీనామా చేయకుండా అరెస్ట్ చేసుకోమనడం దారుణం అన్నారు.
కరీంనగర్ కు మెడికల్ కాలేజీ మంజూరు చేయకుండా తీవ్ర నష్టం చేస్తున్నారని, తీగలగుట్టపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి, నేదునూర్ ప్రాజెక్టు, సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టన్నుకు 5 నుంచి10 కిలోల తరుగు తీస్తున్నారని, రైతులను కల్లాల్లోనే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ‘ధరణి’ పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 5న చేపట్టే ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని ప్రభాకర్ కోరారు. సమావేశంలో ఆయనతో డీసీసీ ప్రెసిడెంట్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.